ఎన్నికలు వస్తే చాలు నాయకులు వేసే వేషాలు.. తీసే రాగాలకు అంతు దరి లేకుండా పోతుంది. ప్రజలను సింపతీ అనే బంధంతో కట్టేసేందుకు నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఇలానే కర్నాటకలో జరుగు తున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఒకరు బీద పలుకులు పలుకుతున్నారు. భార్య-భర్త అనే మాటకు ఆయన వేరే అర్ధం చెప్పారు. `భార్య-భార్య కలిసి కాపురం చేస్తారు. కానీ, వారిద్దరూ వేర్వేరు` అని సూత్రీకరిం చారు. మరి దీనికి కారణం ఏంటో.. మీరూ చదవండి!
కర్ణాటకలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎం.టి.బి.నాగరాజు.. మరోసారి టికెట్ తెచ్చుకున్నా రు. దీంతో ఆయన నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు. ఈ సమయంలో అఫిడవిట్ తయారు చేశారు. దీనిలో ఆస్తులను వివరించారు.ఇక్కడే ఆయన తన బుద్ధి కుశలతను వినియోగించేశారు. తమ కుటుంబానికి రూ.1,609 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. భార్య పేరిట 536 కోట్ల రూపాయల చరాస్తులు, 1,073 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. దీనిలో తనకు ఒక్క రూపాయి కూడా వర్తించదని చెప్పారు. తాను బీదవాడినని చెప్పారు.
మరి కుటుంబం అన్నారు కదా.. అనే డౌట్ వస్తుందేమో.. కుటుంబం అంటేకాపురం వరకే.. అని కొత్త ఫార్ములా చెప్పారు నాగరాజు. ఇక, ఇదేసమయంలో వీరిద్దరికీ రూ.98.36 కోట్ల రుణాలున్నాయని పేర్కొన్నారు. తాను దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ వివరాలను వెల్లడించారు. హొసకోటె నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. సోమవారం నామినేషన్లు సమర్పించారు.
బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలిచిన ఆయన.. అప్పట్లో రూ.1,120 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. గెలిచిన తరువాత పార్టీ మారారు. మరి ఈ మంత్రి నాగరాజు చెబుతున్న ఈ బీదపలుకులు ఏమేరకు సింపతీ ఓట్లు తెస్తాయో చూడాలి.