టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా కుప్పంలో మొదలుబెట్టిన ఈ పాదయాత్ర పలమనేరుకు చేరుకున్న సందర్భంగా అక్కడ టీడీపీ శ్రేణులు లోకేష్ కు ఘన స్వాగతం పలికాయి. ఈ క్రమంలోనే తాజాగా లోకేష్ పాదయాత్ర కర్ణాటక సరిహద్దు వెంబడి సాగుతోంది. ఈ నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకు కర్ణాటక పోలీసులు భారీ స్థాయిలో భద్రత కల్పించారు.
పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా పదుల సంఖ్యలో పోలీసులు లోకేష్ వెంట నడిచారు. తనకు సహకరించిన కర్ణాటక పోలీసులకు నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు, కర్ణాటక సరిహద్దులోని పెట్రోల్ బంక్ లో తన కాన్వాయ్ లోని వాహనాలకు లోకేష్ దగ్గరుండి పెట్రోల్ కొట్టించారు. అంతేకాదు, ఆ పెట్రోల్ బిల్లుకు లోకేష్ స్వయంగా డబ్బులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆంధ్రాలో పెట్రోల్, డీజిల్ రేట్లకు…ఆంధ్రా సరిహద్దుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ రేట్లకు మధ్య ఉన్న వ్యత్యాసం ఎంతో లోకేష్ అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే జగన్ పై లోకేష్ విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో లీటర్ పెట్రోల్ 102 రూపాయలు ఉందని, లీటర్ డీజిల్ 88 రూపాయలు ఉందని చెప్పారు. అదే సమయంలో ఆంధ్రాలో లీటర్ పెట్రోల్ ధర 111.50గా ఉందని, డీజిల్ ధర 99. 27 పైసలు ఉందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై కూడా జగనన్న బాదుడే బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. తనతో పాటు నడుస్తున్న కార్యకర్తలకు, ప్రజలకు ఏపీ, కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ రేట్ల మధ్య ఉన్న తేడాను వివరించారు.
అంతేకాదు దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏపీ అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. ఇక, లోకేష్ పర్యటనను అడ్డుకునేందుకు పదుల సంఖ్యలో ఏపీ పోలీసులు ఆంక్షలు విధించి, భద్రత కల్పించేందుకు నిర్లక్ష్యం వహిస్తుండగా…పొరుగు రాష్ట్రం కర్ణాటక పోలీసులు మాత్రం దగ్గరుండి లోకేష్ కు భారీ భద్రత కల్పించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
లోకేష్ పాదయాత్రకి కర్ణాటక పోలీసుల రక్షణ..జగన్ ఆదేశాలతో ఏపీ ఖాకీల నిర్లక్ష్యం
జగన్ ఆదేశాలతో రక్షణ కల్పించాల్సిన ఏపీ పోలీసులు తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. (1/5) pic.twitter.com/xpXBu8Tq0L
— Telugu Desam Party (@JaiTDP) January 29, 2023