అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరలను తగ్గిస్తూ దీపావళి కానుకను ఇచ్చిన మోడీ సర్కారు నిర్ణయం గురించి తెలిసిందే. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి ప్రతిగా తొలుత బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఆ తర్వాత మిగిలిన మరికొన్ని బీజేపీయేతర రాష్ట్రాలు సైతం వ్యాట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. పెట్రోల్.. డీజిల్ ధరలు మరింతగా తగ్గాయి. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేంద్రం తగ్గించిన ధరలే తప్పించి.. రాష్ట్రాలు మాత్రం తాము వసూలు చేస్తున్న వ్యాట్ ను తగ్గించేందుకు ఇష్టపడలేదు.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. వ్యాట్ బాదుడు ఏపీలో ఎక్కువగా ఉంటే.. తర్వాతి స్థానాల్లో తెలంగాణ ఉంది. తాజాగా పలు రాష్ట్రాలు తమ వ్యాట్ పోటు శాతాన్ని తగ్గించటంతో ఏపీ.. తెలంగాణ ప్రభుత్వాలు వసూలు చేస్తున్న వ్యాట్ కు ఇతర రాష్ట్రాల మధ్య అంతరం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే.. ఏపీతో సరిహద్దులు పంచుకునే రాష్ట్రాల్లో పెట్రోల్.. డీజిల్ ధరలు తక్కువగా ఉంటే.. ఏపీలో మాత్రం ఎక్కువగా ఉన్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో మరే రాష్ట్రానికి లేనంత ఎక్కువగా సరిహద్దులు ఏపీతోనే ఉంటాయి. ఒకవైపున ఒడిశా.. మరోవైపున తెలంగాణ.. ఇంకోవైపున కర్ణాటక.. తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఏపీతో సరిహద్దును కలిగి ఉన్నాయి. చుట్టూ ఉన్న ఇన్ని సరిహద్దు రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణతో తప్పించి.. మిగిలిన రాష్ట్రాల్లో అమలవుతున్న పెట్రోల్.. డీజిల్ ధరలతో పోలిస్తే ఏపీలో ఎక్కువగా ఉన్నాయి.
ఈ విషయాన్ని గుర్తించిన సరిహద్దు రాష్ట్రాల వ్యాపారులు కరపత్రాల్ని ప్రింట్ చేసి మరీ.. తమ వద్ద పెట్రోల్.. డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. దీంతో.. సరిహద్దుల్లో ఉన్న పెట్రోలో బంకుల వ్యాపారుల వ్యాపారం మీద తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చుట్టూ ఉన్న రాష్ట్రాల వారు పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గించిన వేళ.. ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.