ఏపీ సీఎం జగన్ ఈ నెలలో రెండు సార్లు దిల్లీ వెళ్లివచ్చారు. తమ్ముడు అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు నుంచి తప్పించడం కోసమే ఆయన అమిత్ షా చుట్టూ తిరుగుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలు సాధించడం కోసమేనని వైసీపీ వర్గాలు వాదిస్తున్నాయి. ఇలాంటి వేళ సీపీఐ నారాయణ కొత్త వాదన ఒకటి వినిపించారు. ఆయన వాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదీ నిజమే కదా.. అనేవారు మొదలయ్యారు.
అవినాశ్ రెడ్డిని సేవ్ చేయడానికేనన్న టీడీపీ వాదనను సీపీఐ నారాయణ బలపరుస్తూనే దానికి అదనంగా మరికొన్ని విషయాలు చెప్పారు. కేవలం అవినాశ్ రెడ్డిని సేవ్ చేయడానికి వెళ్తే అందుకు బీజేపీ ఏమీ ఓకే చెప్పదని.. ప్రతిఫలంగా వారికి ఫేవర్ చేయాల్సిందేనని.. నిన్నటి జగన్ పర్యటనలో అలాంటి డీల్ ఒకటి కుదిరిందన్నది సీపీఐ నారాయణ వాదన.
రాత్రి పదకొండున్నరకు అమిత్ షా, జగన్‌ల మధ్య జరిగిన సమావేశంలో రాజకీయ ఒప్పందం కుదిరిందని.. వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి అవినాశ్ రెడ్డిని తప్పిస్తే కర్ణాటక ఎన్నికలలో బీజేపీకి తన వంతు సాయం చేయడానికి జగన్ ముందుకొచ్చారని.. కర్ణాటకలో 100 సీట్లలో బీజేపీ అభ్యర్థులకు డబ్బు సమకూర్చేలా జగన్, అమిత్ షా మధ్య ఒప్పందం కుదిరిందన్నది నారాయణ చేస్తున్న ఆరోపణ.
జగన్ తాను సంపాదించిన డబ్బులో కొంత ఇప్పుడు కర్నాటక ఎన్నికలలో ఖర్చు చేయబోతున్నారని.. ఫలితంగా వైఎస్ వివేకా కేసు మరికొంత కాలం ఆలస్యమవుతుందని నారాయణ జోష్యం చెప్తున్నారు. అంతేకాదు.. ఎంతయినా డబ్బు ఖర్చు చేయగల వైసీపీని ఓడించాలంటే టీడీపీ, జనసేన, వామపక్షాలు అన్నీ కలవాలని నారాయణ అన్నారు. ఇప్పటివరకు తమతో పొత్తుల చర్చ జరగలేదని.. కానీ, పొత్తులకు తాము సిద్ధమేనని నారాయణ చెప్పారు.