కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై అవినీతిమరకలు ఏమాత్రం పోవడం లేదు. గతంలో బీజేపీ మంత్రివర్గంలోని మినిస్టర్ కె.ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ డిమాండ్ చేయడంతో అది ఇచ్చుకోలేక ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తీవ్ర వివాదంగా మారి.. సదరు మంత్రిని తప్పించారు. ఈ కేసువిచారణలోఉంది. ఇక, ఇటీవల సీఎం బొమ్మై.. జర్నలిస్టులను మచ్చిక చేసుకునేందుకు వారికి లక్షల రూపాయల కానుకలు ఇచ్చారనే విషయం వెలుగు చూసి.. ఇంకా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై సీఎం వివరణ ఇచ్చినా.. పరిస్థితి సర్దుమణగలేదు.
ఇక, తాజాగా.. మరో కాంట్రాక్టర్.. తనకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావాల్సి ఉందని.. అయితే, దీనికి సంబంధించి 40 శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారని.. నేను చచ్చిపోయేందుకు అనుమతి ఇవ్వండి అని.. ఏకంగా ప్రధాన మంత్రికి మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కాంట్రాక్టర్ రాసిన లేఖ రాష్ట్రంలో తీవ్ర వివాదం అయింది. సోషల్ మీడియాలోజోరుగా వైరల్ అవుతోంది.
ఏం జరిగింది.. ఎవరు?
కర్ణాటకలోని హుబ్లీకి చెందిన ఓ కాంట్రాక్టర్.. కారుణ్య మరణానికి అనుమతి కోరాడు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు లేఖ రాశాడు. ఇక్కడి అధికారులు అడిగినంత కమీషన్లు ఇచ్చుకోలేకపోతున్నానని, తనకు మరణమే శరణ్యమని లేఖలో పేర్కొన్నాడు. తనకు రావాల్సిన బిల్లులను క్లియర్ చేసేందుకు అధికారులు ఏకంగా 40 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు.
చిక్కమగళూరు జిల్లాలోని కడూరు, మూడిగెరె గ్రామ పంచాయతీలకు కొవిడ్-19 సంబంధిత పరికరాలను సరఫరా చేశానని కాంట్రాక్టర్ బసవరాజ్ లేఖలో పేర్కొన్నాడు. ఇందుకు తనకు చెల్లింపులు జరపకుండా అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని చెప్పాడు. దాదాపు రూ.1.12 కోట్ల బిల్లులను పాస్ చేయడానికి 40 శాతానికంటే ఎక్కువ కమీషన్ ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని తెలిపాడు.
పరికరాలు సరఫరా చేసి రెండేళ్లు కావొస్తున్నా బిల్లులు పాస్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు బసవరాజ్. గతంలో తన ఫిర్యాదు మేరకు బిల్లులు పాస్ చేయాలని పీఎంఓ, సీఎంఓ అధికారులు పలుమార్లు పంచాయతీ అధికారికి సూచించినా ఫలితం లేదని వాపోయాడు. అందుకే గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. దీనికి అనుమతించాలని ఆయన పీఎం సహా సీఎంను కూడా అభ్యర్థించాడు. మరివారు ఏం చేస్తారో చూడాలి.