ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు.. అందుకే ఓడాం.. జగన్ విధేయుడి సంచలనం
గెలుపు తప్పుల్ని దాచేస్తుంది. ఓటమి మాత్రం అందుకు విరుద్ధంగా కడుపులో ఉన్నదంతా కక్కేలా చేస్తుంది. అధికారంలో ఉన్న వేళ.. అంతా తానైనట్లుగా వ్యవహరించి.. పార్టీ ముఖ్యులు.. తనకు వీర విధేయులుగా వ్యవహరించే వారు చెప్పే మాటల్ని సైతం పట్టించుకోని తీరుపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఓపెన్ అవుతున్నారు.
ఓటమికి కారణం అధినేత వ్యవహరించిన తీరు అన్న విషయాన్ని తమ మాటల్లో చెప్పేస్తున్నారు. ఆ జాబితాలోకి వస్తారు చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. సంచలనంగా మారాయి. అధికారంలో ఉన్న వేళలో జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించారు? పార్టీ నేతల మాటలకు.. వారిచ్చే సూచనల విషయంలో ఎలా స్పందించేవారన్న విషయాన్ని ధర్మశ్రీ చేసిన వ్యాఖ్యల్ని చదివితే అర్థమైపోతుంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో తప్పులు జరిగాయని.. వాటిని సరిదిద్దుకోకపోవటంతోనే ఎన్నికల్లో ఓటర్లు తమను తిరస్కరించినట్లుగా పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు జగన్ కు ఎన్నోసార్లు రోడ్ల దుస్థితి గురించి చెప్పానని.. అయినా ఆయన వినిపించుకోలేదన్నారు. ‘‘నా ఓటమికి కారణం బీఎన్ రహదారి గోతులే. ఎన్నికలకు ముందు జగన్ కు ఎన్నోసార్లు చెప్పా. ఆయన వినిపించుకోలేదు. ఫలితంగా భారీ ఓట్ల తేడాతో దారుణంగా ఓడా. సొంత డబ్బులు రూ.2కోట్లు రోడ్ల కోసం ఖర్చు చేశా. కూటమి ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుందో లేదో తెలియట్లేదు’’ అంటూ ఓపెన్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతలకు ఆసక్తికర సూచన చేశారు. తమ పార్టీకి చెందిన సర్పంచులు.. ఎంపీపీలు.. ఎంపీటీసీ.. జెడ్పీటీసీ సభ్యులకు తాను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నట్లు చెబుతూ.. ‘‘మంత్రులు.. ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే స్వాగతం పలికి వారితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆహ్వానం లేకపోతే వెళ్లటం.. వెళ్లకపోవటం మీ ఇష్టం’’ అని పేర్కొన్నారు. తాము తెలిసో తెలియకో తప్పులు చేశామని.. అందుకే ప్రజలు తమను అధికారానికి దూరం చేశారన్న ధర్మశ్రీ.. ‘ఓటమిని అంగీకరించాం. అవే తప్పులు మీరూ చేస్తూ అలాంటి ప్రజాతీర్పే కోరుకుంటారా?’’ అంటూ టీడీపీ నేతలకు చురకలు అంటించే ప్రయత్నం చేశారు.