రాజకీయంగా సీనియర్ నేత, ప్రకాశం జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడు.. దాదాపు 40 ఏళ్లుగా రాజకీ యాల్లో ఉన్న నేతగా ప్రముఖ గుర్తింపు పొందిన నేత.. కరణం బలరామకృష్ణమూర్తి. కమ్మసామాజిక వర్గానికి చెందిన నాయకు డిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే.. ఇప్పుడు ఆయన రాజకీయంగా ఓ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తనకు బాగానే గుర్తింపు ఉన్నా.. తన కుమారుడు వెంకటేష్ కోసం ఆయన తపన పడుతున్నారు. తన రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకునేందుకు 2014లోనే తన కుమారుడుని ఎన్నికల బరిలోకి దింపారు. అప్పట్లో తమకు బలమైన నియోజకవర్గం .. కమ్మ సామాజిక వర్గానికి పట్టున్న అద్దంకి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేయించారు.
కానీ, ఆ ఎన్నికల్లో వైసీపీ నాయకుడు గొట్టిపాటి రవి దూకుడుతో కరణం కుమారుడు ఓడిపోయారు. పోనీలే.. 2019లో అయినా అదృష్టం కలిసి రాదా? అనుకున్నారు. అయితే, మారిన రాజకీయ సమీకరణలతో గొట్టిపాటి సైకిల్ ఎక్కారు. దీంతో గత ఏడాది ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం టీడీపీ టికెట్‌ను గొట్టిపాటికే కేటాయించారు చంద్రబాబు. ఆయన విజయం సాధించారు. అదేసమయంలో తన కుమారుడు వెంకటేష్‌కు టికెట్ ఇవ్వాలన్న కరణం అభ్యర్థనను తోసి పుచ్చి.. చీరాల నుంచి నేరుగా బలరాంకే టికెట్ ఇచ్చారు. ఆయన కూడా విజయం దక్కించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సునామీ ఉన్నప్పటికీ.. ప్రకాశంలో టీడీపీ నాలుగు స్తానాల్లో విజయం దక్కించుకుంది.
ఇది ఒకరకంగా బాగానే ఉన్నా.. కరణం విషయంలో మాత్రం కుమారుడి దిగులుకు చెక్ పడలేదు. దీంతో ఆయన వైసీపీలోకి జారుకున్నారు. ఇక్కడ ఆయన కుమారుడికి అభయం లభించినట్టే లభించి.. జారుకుంటోంది. వైసీపీలో రెండు స్థానాలపై కరణం కుటుంబం దృష్టి పెట్టింది. ఒకటి అద్దంకి. రెండు చీరాల. ఈ రెండింటిలో ఏదో ఒకటి తన కుమారుడికి ఇప్పించుకోవాలనేది.. కరణం పట్టుదల. కానీ, ఇప్పుడు మారుతున్న పరిస్థితిలో చీరాలలో రాజకీయాలు కరణంకు కలిసి రావడం లేదు. ఆమంచి దూకుడుతో ఆయన రాజకీయాలు మైనస్ అవుతున్నాయి. వైసీపీ కూడా బలమైన వాయిస్‌తోపాటు వైసీపీలో కీలక నేతల అండ ఉన్న ఆమంచిని కాదని కరణం కుమారుడు వెంకటేష్‌కు చీరాల టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
పోనీ.. అద్దంకిపై గురి చూద్దామా? అని కరణం ఆలోచిస్తున్నా.. ఇక్కడ రెండు బలమైన కారణాలు.. కరణం కుటుంబాన్ని ఇరుకు న పెడుతున్నాయి. గొట్టిపాటిపై స్థానికంగా వ్యతిరేకత లేకపోవడంతోపాటు.. ఆయన ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీలోకి చేరే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే..మళ్లీ ఆ టికెట్ గొట్టిపాటికే కేటాయిస్తారు. ఈ పరిస్తితిలో తమకు ఎక్కడా చోటు లేకుండా పోయిందనే భావన కరణం కుటుంబంలో కనిపిస్తోంది. పోనీ.. వైసీపీ నేతలు చెబుతున్నట్టు.. పరుచూరుకు మకాం మార్చేద్దామంటే…అక్కడ పుంజుకోవడం కూడా ఇప్పట్లో సాధ్యం కాదు.. అసలు సాధ్యమయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు. టీడీపీ నేత ఏలూరి బలంగా ఉన్నారు. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. కరణం కుమారుడి రాజకీయం ఇప్పట్లో ముడిపడేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.