పెళ్లంటే పందిళ్లు-సందళ్లు-తప్పట్లు-తాళాలు-తలంబ్రాలూ.. అని పాడుకుంటున్నారా? అయితే.. ఇవేవీ పెళ్లి కిందకు రావని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పేసింది. అసలు హిందూ వివాహ చట్టంలో ఇవేవీ లేవని కూడా పేర్కొంది. “పెళ్లంటే కన్యాదానం అనుకుంటారు. అలాగని ఏ చట్టం పేర్కొంది. పెళ్లంటే కన్యాదానం కాదు. కేవలం `సప్తపది` మాత్రమే పెళ్లిగా పరిగణిస్తాం“ అని ఓ కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అంతేకాదు.. కన్యాదానానికి అసలు ప్రాధాన్యమే లేదని తెలిపింది.
వాస్తవానికి హిందూ వివాహంలో కన్యాదానానికే పెళ్లి కుమార్తె , కుమారుడు తరఫు వారు ప్రాధాన్యమిస్తారు. పెళ్లి కుమారుడి పాదాలు కడిగి.. కాబోయే మామగారు.. తన కుమార్తెను దానంగా ఇస్తారు. దీనికి చాలా మంత్రులు, అరగంట ప్రొసీజర్, పెళ్లి కూతురి మాతృమూర్తి.. నీళ్లు పోస్తుండగా.. తండ్రి కాబోయే అల్లుడి పాదాలు కడగడం.. వంటివి అత్యంత ప్రధానంగా భావిస్తారు. అలాంటి కీలక క్రతువు అసలు హిందూ వివాహ చట్టంలోనే లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేయడం గమనార్హం. కేవలం సప్తపదికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది.
విషయం ఏంటంటే..
బిహార్‌కు చెందిన అశుతోష్ యాదవ్ అనే వ్యక్తికి ఓ యువతితో వివాహం జరిగింది. అయితే.. యువతి బంధువులకు ఈ వివాహం ఇష్టం లేదు. దీంతో కొన్నాళ్ల తర్వాత.. దీనిని `దొంగపెళ్లి`గా పేర్కొంటూ.. కోర్టులో కేసు వేశారు. అయితే.. తాను అందరి మధ్య పెళ్లి చేసుకున్నానని.. దీనికి తన భార్య తరఫున కుటుంబ సభ్యులు రాలేదని.. అశుతోష్ తన పిటిషన్లో వివరించారు. ఈ క్రమంలోనే సాక్ష్యులను విచారించాలని.. కన్యాదానం చేసిన యువతి బాబాయిని కూడా విచారించాలని కోరారు. అయితే.. దిగువ కోర్టు ఈ కేసును కొట్టేసింది. దీంతో అశుతోష్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన కోర్టు.. అసలు సాక్షులను పిలవాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతేకాదు.. కన్యాదానం చేసింది కూడా తమకు అవసరం లేదని, హిందూ వివాహచట్టంలో ఈ క్లాజ్ కూడా లేదని తెలిపింది. అయితే.. `సప్తపది` జరిగిందా? లేదా అనేది మాత్రమే చూస్తామని తెలిపింది. హిందూ వివాహ ప్రక్రియలో కన్యాదానం కేవలం ఒక వేడుక మాత్రమేనని తెలిపింది.