ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పనితీరుపై సంతృప్తి చెందని బీజేపీ అధిష్టానం ఏడాదికి ముందు సోము వీర్రాజును నియమించిన సంగతి తెలిసిందే. తిరుపతిలో షా కాన్వాయ్ పై దాడి వంటి పరిణామాలు జరగడం, కన్నాపై అపనమ్మకాన్ని పెంచడంతో కన్నాను తప్పించారు. ఆ తర్వాత ఎంతోకాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం కాచుకు కూర్చున్న సోము వీర్రాజుకు ఏపీ పగ్గాలు అప్పగించారు.
అయితే, సోము పదవి చేపట్టిన ఏడాది కాలంలో జగన్ పై, వైసీపీపై విమర్శలు గుప్పించడంలో, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో సోము వీర్రాజు విఫలమయ్యారని అధిష్టానం భావిస్తోందట. జగన్ పై పోరు సంగతి పక్కనబెడితే…బీజేపీ కేడర్ లోనూ లీడర్ గా సోముకు పట్టు లేదని బీజేపీ పెద్దలకు రహస్య నివేదిక అందిందట. ఈ క్రమంలోనే మరో రెండు మూడు రోజుల్లో సోముుకు ఉద్వాసన తప్పదని జోరుగా ప్రచారం జరుగుతోంది.
సోము స్థానంలో తిరిగి కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ చీఫ్ గా నియమించేందుకు ఢిల్లీ పెద్దలు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సోముతో పోలిస్తే ఏపీలో బీజేపీ ఉనికిని కాపాడడంలో కన్నా బెటర్ అని బీజేపీ పెద్దలు ఫీల్ అవుతున్నారట. అమరావతి రాజధాని, రైతుల పోరాటానికి బాసటగా నిలిచిన కన్నా..ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో, అమరావతి రైతులు కూడా ఏపీ బీజేపీకి మద్దతిచ్చారు. అయితే, సోము వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది.
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన జంటగా బరిలోకి దిగినా…డిపాజిట్ దక్కకపోవడం సోము వైఫల్యమేనని టాక్. తనపై వేటు తప్పదని తెలిసిన సోము…ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవాలనుకున్నా…అపాయింట్ మెంట్ దొరకడం లేదట. ఏపీ బీజేపీ ఇన్చార్జి శివప్రకాశ్ రాష్ట్రంలో పర్యటించి సోముపై రిపోర్ట్ తయారు చేశారట. అది సోముకు వ్యతిరేకంగా ఉందట. దీంతో, కన్నాతోపాటు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మరో రెండు పేర్లను అధిష్టానం పరిశీలిస్తోందట.