బీజేపీలో సోము వీర్రాజు వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ వార్ తీవ్రంగా జరుగుతున్న సమయంలో సోము వీర్రాజు వికీపీడియా పేజీలో కనిపిస్తున్న ఓ ఆసక్తికర అంశం చర్చనీయమవుతోంది. ఇందులో సోము వీర్రాజు తప్పు లేనప్పటికీ ఆయన పేజీలో కన్నా లక్ష్మీనారాయణను బ్రోకర్‌గా పేర్కొనడంపై ఆక్షేపణ వ్యక్తమవుతోంది.
సోము వీర్రాజు ఇంగ్లీష్ వికీపీడియాను కనుక తెరిస్తే కుడివైపు కనిపించే ఆయన ఫొటో కింద వివరాలుంటాయి. అందులో సోము వీర్రాజు బీజేపీ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ అని కనిపిస్తుంది. ఆయన ఆ బాధ్యతలు ఎప్పుడు చేపట్టారో కూడా ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది.. ఆ తరువాత అసలు సమస్య.
https://en.wikipedia.org/wiki/
వీర్రాజు కంటే ముందు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడుగా పనిచేశారన్నదీ అక్కడ ప్రస్తావించారు. అయితే.. కన్నా లక్ష్మీనారాయణ అని కాకుండా ‘కన్నా లక్ష్మీనారాయణ బ్రోకర్’ అని అక్కడ కనిపిస్తోంది. అది కూడా ఓ వికీపీడియా పేజ్ లింక్. ఆ లింక్ ఓపెన్ చేస్తే కన్నా లక్ష్మీనారాయణ బ్రోకర్ అనే పేజ్ ఓపెన్ అవుతోంది.
నిజానికి కన్నా లక్ష్మీనారాయణ పేరుతో అసలైన వికీపీడియా పేజీ ఉన్నప్పటికీ బ్రోకర్ అని ఉన్న ఈ ఫేక్ పేజీకి సోము వీర్రాజు వికీ ప్రొఫైల్‌కు లింక్ చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందా పొరపాటున చేసిందా అనేది తెలియనప్పటికీ ఈ లింక్ చూసే కన్నా అభిమానులు మాత్రం ఆగ్రహిస్తున్నారు.
సాధారణంగా వికీపీడియా పేజీలను నేతల విషయంలో వారి అనుచరులో, అభిమానులో ఎవరో తయారుచేస్తారు. వికీపీడియా ఎడిటర్స్ వాటిని చూసి ఓకే చేస్తారు. కాబట్టి సోము వీర్రాజు వికీపీడియా పేజీలో కన్నాను ఇలా పేర్కనడంతో సోము వీర్రాజు అనుచరవర్గం హస్తమూ ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే…. సోము వీర్రాజుకు సంబంధించిన ఇంగ్లీష్ వికీపీడియా పేజీలో మాత్రమే కన్నాను ఇలా పేర్కొన్నారు. తెలుగు వికీపీడియా పేజీలో మాత్రం కన్నా లక్ష్మీనారాయణకు చెందిన అసలైన వికీపీడియా పేజీనే లింక్ చేశారు.
ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న సమయంలో వికీపీడియాకు చెందినవారు ఇలాంటి పొరపాట్లను పరిహరిస్తే బాగుండేది.