ఇరు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులలో సీనియర్ పొలిటిషన్ గా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు పేరుంది. అటువంటి కన్నా నేడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వేలాదిమంది అనుచరులతో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ సైకిల్ ఎక్కారు. కన్నా లక్ష్మీనారాయణకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో చంద్రబాబును వ్యతిరేకించిన తాను టిడిపిలో చేరడంపై కొందరు సందేహాలు వ్యక్తం చేసే అవకాశం ఉందని కన్నా అన్నారు. అయితే, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, తండ్రిని మరిపించే పాలన అందిస్తానంటూ ఒక్క ఛాన్స్ కోరిన జగన్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. అయితే, సంక్షేమం పేరుతో చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్తున్న విధంగా జగన్ ప్రజలను దోచుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. తన జేబులో సొంత సొమ్ము, లేదంటే భారతి సిమెంట్ నుంచి డబ్బులు తెచ్చో ఇస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.
9 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన జగన్ ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసే దుస్థితికి దిగజారారని దుయ్యబట్టారు. ఆర్టీసీ చార్జీలు, కరెంటు బిల్లులు…ఇలా ప్రజల నడ్డి విరిచేలా పన్నులు వేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతగా అమరావతికి మద్దతు పలికిన జగన్…సీఎం అయిన తర్వాత మూడు రాజధానులంటూ మాట మార్చారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖనైతే దోచుకోవడం సులభంగా ఉంటుందని మూడు రాజధానులు అంటున్నారని విమర్శించారు. ఏపీలో జగన్ రాక్షస పాలన పోవాలని, అమరావతి రాజధాని కావాలని…ఈ రెండు కారణాలతోనే తాను టిడిపిలో చేరానని కన్నా చెప్పుకొచ్చారు.