మాజీ మంత్రి, సీనియర్ పొలిటిషన్ కన్నా లక్ష్మీనారాయణను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టిడిపిలోకి కన్నా రావడం శుభపరిణామమని, ఆయనను మనస్పూర్తిగా టిడిపిలోకి ఆహ్వానిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. కన్నాతో పటు పలువురు నేతలు టిడిపిలో చేరారని, ఈ ఉత్సాహం చూస్తుంటే టిడిపి అధికారంలోకి వచ్చినట్టుగా ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న నేత కన్నా అని, అసెంబ్లీలో ఆయనను చూశానని చంద్రబాబు చెప్పారు.
పెద్దకూరపాడులో గతంలో కన్నాపై గెలవాలని ప్రయత్నించామని, కానీ, ఆయన ఉన్నంతవరకు టిడిపి గెలుపు సాధ్యం కాలేదని కితాబిచ్చారు. కన్నాతో గతంలో తమకు రాజకీయ విభేదాలున్నాయని, కానీ, వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. సైకో పాలన పోవాలి-సైకిల్ పాలన రావాలి అన్న నినాదంతోనే కన్నాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజీనామా చేసి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో చేరారంటే కన్నా ఆలోచన ఏమిటో అర్థం చేసుకోవాలని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలన్నా, అమరావతి రాజధాని కావాలన్నా టిడిపితో సాధ్యమని కన్నా భావించారని చెప్పారు. రాష్ట్రాన్ని ఈ స్థాయిలో భ్రష్టు పట్టించిన సీఎం మరొకరు లేరని, రివర్స్ పాలనతో విధ్వంసకర స్వభావాన్ని బయట పెట్టుకున్నారని జగన్ ను విమర్శించారు.
ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ ఎంత భయంకరమైన మనిషో అర్థమైందని, ప్రజల పన్నులతో కట్టిన భవనాన్ని కూల్చడం జగన్ లెక్కలేనితనానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో కొందరు అసమర్థ సీఎంలు, అవినీతి సీఎంలు గతంలో ఉన్నారని…కానీ ఈ స్థాయిలో విధ్వంసకర పాలన సాగించిన సీఎం మనకు లేరని జగన్ కు చురకలంటించారు. మీడియాను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, వారి వ్యాపారాలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
ఈరోజు లోకేష్ పాదయాత్ర, తన రోడ్ షోలను జగన్ అడ్డుకుంటున్నారని, ఆరోజు వైఎస్సార్, జగన్ ల పాదయాత్ర ఆపాలంటే తనకు సెకన్ పని అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నువ్వేమైనా పుడింగివా? రాజకీయాల్లో హుందాతనం అవసరం అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.