గుంటూరు జిల్లా పరిధిలోని అత్యంత కీలకమైన నియోజకవర్గాలలో ఒకటైన సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా మాజీ మంత్రి మరియు సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు .
ఈ మేరకు టిడిపి హై కమాండ్ తరపున రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు బుధవారంనాడిక్కడ ఉత్తర్వులు జారీ చేశారు .
దీంతో 2024 లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో టిడిపి తరఫున ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారో స్పష్టత వచ్చినట్టయింది.
ఫలితంగా టిడిపికి మింగుడు పడని నేతగా మారిన మంత్రి అంబటి రాంబాబు కు చెక్ పెట్టినట్టు అయింది .
ఇంతకాలం అంబటి రాంబాబుకు ను కట్టడి చేసేందుకు అభ్యర్థిని అన్వేషించిన నారా చంద్రబాబు నాయుడుకు కన్నా లక్ష్మీనారాయణ రూపంలో సమయం కలిసి వచ్చింది.
అంది వచ్చిన ఛాన్స్…?
అంది వచ్చిన చాన్సును సద్వినియోగం చేసుకున్నారు.
కన్నా లక్ష్మీనారాయణను ఇన్చార్జిగా నియమించడం ద్వారా బలమైన సంకేతాలను పంపారు.
ఒక విధంగా పాలక పక్షమైన వైసీపీకి మరియు మంత్రి అంబటి రాంబాబుకు సవాల్ విసిరినట్టు అయింది.
కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేసులో కూడా ఒక దశలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు.
పెదకూరపాడు నుంచి మరియు గుంటూరు వెస్ట్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు .
మంత్రిగా కూడా పనిచేశారు.
నవ్యాంధ్ర విశాల ప్రయోజనాలే ముఖ్యం
సిద్ధాంత రీత్యా టిడిపితో ఆయనకు విభేదాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు తెలుగుదేశం అధినేతతో జతకట్టినట్టు ఆ సందర్భంగా ఆయన స్పష్ఠికరించారు.
కన్నా లక్ష్మీనారాయణ ఎంపిక చేసుకున్న సత్తెనపల్లి నియోజకవర్గం కాపులకు కంచుకోటగా ఉంది.
తెలుగుదేశం పార్టీకి కూడా తిరుగు లేని స్థానం అనే చెప్పవచ్చు.
కోడెల శివరాంకు నో ఛాన్స్…?
వాస్తవానికి ఈ నియోజకవర్గం నుంచి దివంగత స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరామ్ పోటీ చేసేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
అయితే మంత్రి అంబటి రాంబాబు మీద కోడెల శివరాం పోటీ చేస్తే సరితూగరని నిర్ణయానికి హై కమాండ్ వచ్చింది .
దీంతో నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.
ప్లాన్ ను అమలు చేశారు…?
కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పక్షంలో ఆ ప్రభావం గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా , బాపట్ల జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ఇతర అన్ని నియోజకవర్గాలపై గట్టిగా ఉంటుంది.
తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ సంకేతాలను ఇస్తుంది.
అందరివాడు కన్నా…?
అందువల్లనే బహుముఖ వ్యూహాలకు టిడిపి అధినేత పదును పెట్టారు .
ఆ క్రమంలోనే రాజధాని జిల్లా అయిన గుంటూరు పై ప్రత్యేక దృష్టి సారించారు.
కన్నా లక్ష్మీనారాయణ ను టిడిపి వైపు తిప్పుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు.
రాజకీయ ఎత్తుగడలు, అపారమైన ప్రజాసేవ అనుభవం, సీనియర్ లెజిస్లేటర్ గా , సీనియర్ మంత్రిగా, సౌమ్యుడిగా, అందరివాడుగా మరియు కాపు నేతగా అనేక పాజిటివ్ లక్షణాలు కన్నా లక్ష్మీనారాయణలో సొంతం.
మంత్రి అంబటి రాంబాబును అవలీలగా ఢీకొనే అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి.
తాజా నిర్ణయంతో కన్నా లక్ష్మీనారాయణ అభిమానులు ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు.
ముందస్తుగానే హామీ…?
పార్టీలో చేరినప్పుడే ముందస్తుగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం వెలువడింది.
తాజా పరిణామాల నేపద్యంలో రాజధాని జిల్లాలో ఇకనుంచి రాజకీయాలు యమ రంజుగా ఉండబోతున్నాయి.
సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణకు నియామక ఉత్తర్వులు అందజేయడానికి ముందు రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కింజారపు సత్యనారాయణ టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు తో మరియు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో సంప్రదించారు మరొకసారి నియామకం అనంతరం మంచి చెడుల గురించి లోతుగా విశ్లేషించారు…
ఇదే విషయాన్ని ఈ ప్రాంతంలో టిడిపి కార్యకలాపాలు చూస్తున్న నేతలకే మరియు కోడెల శివరాంకు సైతం సమాచారం అందించడం జరిగింది.
వేరే విధంగా శివరాం పార్టీ పరంగా న్యాయం జరుగుతుందని అధిష్టాన వర్గం తరఫున అచ్చం నాయుడు హామీ ఇవ్వడం జరిగింది.
రాయపాటిని పక్కన పెట్టిన హైకమాండ్…?
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు కీలకమైన ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో అనేక అంశాలు మళ్లీ తెరపైకి రానున్నాయి.
గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోవైపు కన్నా లక్ష్మీనారాయణతో రాజకీయపరంగా ఉప్పు- నిప్పులా ఉంటారు.
కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో చేరికను రాయపాటి బహిరంగంగా వ్యతిరేకించారు.
గత సాధారణ ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన రాయపాటి సాంబశివరావు అభిప్రాయాలను టిడిపి అధిష్టాన వర్గం పక్కకు పెట్టింది.
పార్టీ విశాల ప్రయోజనాలు ముఖ్యమని, 2024 లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాల్సిందేనని నిర్దిష్టమైన అభిప్రాయంతో టీడీపీ అధినాయకత్వం ఉన్నది.
2024 టార్గెట్…?
అందువల్లనే స్థానిక పార్టీ పంచాయతీలను పక్కకు పెడుతోంది.
ఇదే పరిస్థితి ఇతర నియోజకవర్గాలలో ఉన్నది.
నిర్మోహమాటంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో స్థానిక నాయకత్వంలో ఉన్న అభిప్రాయాలను అణచివేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
పక్కా సమాచారంతో నిర్దిష్టమైన విధానాలను ముక్కుసూటిగా అమలు చేయడం ను ఇప్పటికే హై కమాండ్ ప్రారంభించింది .
ఎలాంటి బేషజాలకు పోకుండా చంద్రబాబు నాయుడు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు.
ఒక మంచి కోసం ఇంకొక చెడు దూరమైనా పర్వాలేదు అనే పద్ధతిలో ఆయన వ్యవహార శైలి ఉంది.
కన్నా అంటేనే ఒక బ్రాండ్…?
రాష్ట్రవ్యాప్త నేత అయిన, మంచి పేరు ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అంటేనే రాష్ట్ర రాజకీయాలలో ఒక బ్రాండ్ ఉంది.
ఏ ప్రాంతానికి వెళ్లినా చెక్కుచెదరని అభిమానులు ఉన్నారు .
తెలుగుదేశం పార్టీలో లక్ష్మీనారాయణ చేరిన నేపథ్యంలో క్రమంగా టిడిపికి దూరమైన వారు కూడా ఆ పార్టీ వైపు దృష్టి సారించడం మొదలుపెట్టారు.
అధికార సాధనే లక్ష్యంగా దృఢ సంకల్పంతో పనిచేయడం ప్రారంభించారు.
ఆ విధంగా కన్నా లక్ష్మీనారాయణ సైతం తన అభిమానులకు పాజిటివ్ సంకేతాలను ఇచ్చారు.