వైసీపీలో కీలక నాయకుల పరిస్తితి ఎన్నికలకు ముందు డోలాయమానంలో పడుతోంది. ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మారుతోంది. నియోజకవర్గంలో రెండు వర్గాలుగా వైసీపీ చీలిపోయింది. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌కు అనుకూల, ప్రతికూల వర్గాలుగా నాయకులు వ్యవహరిస్తున్నా రనే టాక్ ఉంది. దీంతో నిన్న మొన్నటి వరకు వైసీపీలో వినిపించిన ఐక్యతా రాగం ఇప్పుడు ఒకింత వెనుక బడడంతోపాటు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా కనిగిరి ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకార సభ జరిగింది. ఈ వేదికపై వైసీపీ ఎమ్మెల్యే, అదే పార్టీ నేతలు కౌంటర్లు, ప్రతికౌంటర్లు వేసుకుని రాజకీయంగా సొంత పార్టీలోనే వేడి పుట్టించడం గమనార్హం. అది కూడా ఎన్నికలకు ముందు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏఎంసీ చైర్మన్ చింతగుట్ల సాల్మన్‌రాజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలు పార్టీలో ఉన్న అసంతృప్తిని, వచ్చే ఎన్నికలపై చూపే ప్రభావాన్ని కూడా కళ్లకు కట్టాయని అంటున్నారు.
ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ మాట్లాడుతూ.. ఆ గట్టున ఉండుంటే(తన వ్యతిరేక వర్గం) ఇప్పుడు ఈ ప్రమాణస్వీకారం సభలో బజాజ్ బుజ్జి(నియోజకవర్గంలో కీలక నేత) ఉండేవాడు కాదని చెప్పారు. నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలం కోవిలంపాడు సర్పంచ్ బజాజ్ బుజ్జి ఏఎంసీ చైర్మన్ పదవి కోసం విశ్వప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే అతనికి చెక్ పెట్టారు. ఇది కొన్నాళ్లుగా ముదిరిపోయింది.
అయితే.. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని బజాజ్ బుజ్జిని సానుకూలం చేసింది. ఇదిలా ఉంటే ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సం కార్యక్రమానికి బజాజ్ బుజ్జి కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ.. ఆయన కౌంటర్లు రువ్వారు. “ఎమ్మెల్యే సారు సీఎం వద్ద తన పరువు కాపాడాల ని కోరితే నేను సంయమనం పాటించి ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి ఉన్నా“ అని చెప్పారు. తాను ఏ గట్టున ఉన్నా నీతిగా నిలబడ్డానని.. అవినీతికి అక్రమాలకు పాల్పడలేదన్నారు. దీంతో ఎన్నికలకు ముందు కనిగిరి కథ మళ్లీ అడ్డం తిరుగుతున్న పరిస్తితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.