బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి పరిచయం అక్కర లేదు. బాలీవుడ్, రాజకీయాలు…ఇలా ఎందులోనైన తన ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంది కంగనా. బీజేపీ అండ చూపుకొని మహారాష్ట్ర సర్కార్ తో, శివసేన నేతలతో గతంలో తకరారుకు దిగిన కంగనా…ఆ తర్వాత సైలెంట్ అయింది. ఇక, కొంతకాలంగా తాప్సీ పన్ను, కంగనాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో, పలు ఇంటర్వ్యూల్లో ఒకరిపై ఒకరు విమర్శలు కూడా గుప్పించుకున్నారు. తాప్సీ ప్రస్తుతం తాను నటించిన ‘హసీనా దిల్రుబా’ ప్రమోషన్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే తన జీవితంలో కంగనాకు ఎలాంటి ప్రాధాన్యం లేదని తాప్సీ వ్యాఖ్యానించింది. దీంతో, ఈ వ్యాఖ్యలపై ఫైర్ బ్రాండ్ కంగనా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాప్సీపై కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాప్సీ బీ గ్రేడ్ ఆర్టిస్ట్ అంటూ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను వదిలేసిన చాలా ప్రాజెక్ట్‌ల్లో తాప్సీకి అవకాశం వచ్చిందని, ఆ అవకాశాలు ఇవ్వాల్సిందిగా తాప్సీ నిర్మాతలను బతిమాలుకొని ఈ స్థాయికి చేరిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, ఈ విషయాన్ని తాప్సీ కూడా చాలా సందర్భాల్లో చెప్పిందని, ఇప్పుడు తాప్సీ జీవితంలో తనకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదంటూ వ్యాఖ్యానిస్తోందని మండిపడింది.
మనుషుల కుళ్లు స్వభావానికి ఇదో నిదర్శనమని, ఏది ఏమైనా తాప్సీ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తున్నానని చెప్పిందీ ఫైర్ బ్రాండ్. అయితే, తన పేరు లేకుండా సినిమా ప్రమోషన్ చేసుకోవాలంటూ తాప్సీపై ఇన్ స్టాగ్రామ్ లో కంగనా పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. మరి, ఈ ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలకు దీటుగా తాప్సీ ఎటువంటి బదులిస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది.