కలలో కూడా ఊహించని రీతిలో కొద్దికాలం క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశ ఉపాధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో భారత మూలాలు ఉన్న కమలా హ్యారీస్ విజయం సాధించటం.. దేశానికి తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా.. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా నిలిచారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె కాసేపు అమెరికా అధ్యక్ష బాధ్యతల్ని నిర్వహించారు. 57 ఏళ్ల కమలాకు ఈ అవకాశం ఎందుకు దక్కిందన్నది ఆసక్తికరంగా మారింది. రెగ్యులర్ చెకప్ లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆసుపత్రికి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయనకు కాసేపు మత్తుమందు ఇచ్చారు. ఈ మత్తు మందు ఇచ్చిన సందర్భంలో ముందస్తు జాగ్రత్తగా.. ఆయన మళ్లీ తన పని తాను చేసుకునే కొద్ది సమయంలో కమలా హ్యారీస్ ను దేశ అధ్యక్ష పగ్గాల్ని నిర్వహించారు.
అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయస్కుడైన దేశాధ్యక్షుడి రికార్డును జోబైడెన్ క్రియేట్ చేయటం తెలిసిందే. ప్రస్తుతం 79వ సంవత్సరంలోకి ప్రవేశించిన ఆయన.. వాషింగ్టన్ శివారులోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ కు చేరుకున్న ఆయన.. పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు కొలనోస్కోపీ చేశారు. పెద్ద పేగుకు సంబంధించి బైడెన్ ప్రతి ఏటా ఈ పరీక్షను చేయించుకుంటూ ఉంటారు. దేశాధ్యక్షుడి బాధ్యతల్ని చేపట్టిన తర్వాత మాత్రం ఈ పరీక్షను చేయించుకోవటం ఇదే తొలిసారి. ఈ పరీక్ష నిర్వహించే వేళలో మత్తు మందు ఇస్తారు. ఈ కారణంతో కాసేపు స్పృహలో ఉండరు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుల వారు స్పృహలో లేని పక్షంలో ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న వారు అధ్యక్ష స్థానాన్ని తాత్కాలికంగా చేపడతారు. మళ్లీ స్పృహలోకి వచ్చే వరకు ఉపాధ్యక్షుడే దేశ అధ్యక్షుడిలా నిర్వహణ బాధ్యతల్ని తీసుకుంటారు. బైడెన్ కు వైద్య పరీక్షలు చేస్తున్న వేళ.. కమలా హ్యారీస్ అమెరికా అధ్యక్ష బాధ్యతల్ని కాసేపు నిర్వహించారు.
దేశ సర్వ సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అణ్వాయుధాల నియంత్రిత వ్యవస్థతో కూడిన ప్రత్యేక బటన్ ఉండే బాక్సును కూడా ఆమెకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని.. స్పృహలోకి వచ్చిన వెంటనే బైడెన్ కు కమలా హ్యారీస్ కు అప్పజెప్పిన అధ్యక్ష పగ్గాల్ని ఆయనకు బదిలీ చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ రోజు (శనివారం)న బైడెన్ 79వ ఏట అడుగు పెడుతున్నారు.