టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ RRR సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. జక్కన్న దర్శకత్వ ప్రతిభకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల అద్భుత నటన తోడవడంతో ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంపై పలువురు దర్శక నిర్మాతలు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఇటువంటి సమయంలో ఈ చిత్రంపై వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ వివాదాస్పద రివ్యూ ఇచ్చాడు.
తనకు నచ్చని సినిమాను అందరికీ నచ్చకుండా చేయాలన్న ఉద్దేశంతో విమర్శలు చేస్తుంటాడని కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కేకు పేరుంది. అతడికున్న పేరు ఏ మాత్రం చెడిపోకుండా…RRRపై KRK నెగిటివ్ ట్వీట్స్‌తో విమర్శలు గుప్పించాడు. రాజమౌళి రూ.600 కోట్లు ఖర్చుపెట్టి ఓ తలా తోక లేని సినిమా తీశారని, ఏ మాత్రం లాజిక్ లేకుండా సినిమా తీసినందుకు 6 నెలలు పాటు ఆయనను జైలులో పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు తీయనటువంటి చెత్త సినిమా ఇదని, బాలీవుడ్ డిజాస్టర్ మూవీ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ వంటి సినిమా ఇదని అక్కసు వెళ్లగక్కాడు.
వార్ సినిమాలో హృతిక్ రోషన్, టైటర్ ష్రాఫ్ లు అద్భుతంగా డాన్స్ చేశారని, కానీ, ఈ సినిమాలో చరణ్, తారక్ ల డ్యాన్స్ బాగోలేదంటూ విమర్శలు గుప్పించాడు. ఇది కేవలం దక్షిణాది ప్రేక్షకులకు మాత్రమే రుచించే సినిమా అని మరోసారి దక్షిణాది చిత్ర పరిశ్రమపై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు. గతంలో, ఇలాగే సల్మాన్ ఖాన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేఆర్కే…ఇపుడు కోర్టుల చుట్టు తిరుగుతున్నాడు. ఇతడి మాటలు, రివ్యూలు పట్టించుకోనవసరం లేదని నెటిజన్లు అంటున్నారు.