ఏపీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఓపెనింగులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో ఈ ఓపెనింగులపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ లు జరుగుతున్నాయి. ప్రజలకు దగ్గరగా ఉండటం, అందరికీ అందుబాటులో ఉండటం మంచిదే గాని దానికి భారీ హైప్ ఇచ్చి పబ్లిసిటీ చేసుకోవడం వైసీపీ నేతల కొంపముంచుతోంది.
ఒకవైపు ఏ పరిశ్రమలు తేకుండా ఇలాంటి చిన్నచిన్నవిషయాలతో ఏపీని ఎటువైపు నడిపిద్దాం అనుకుంటున్నారన్న ప్రశ్నల వర్షం కురుస్తోంది. తటస్థ ఓటర్లు వైసీపీ నేతల తీరును ఎండగడుతున్నారు. మొన్న ఒక చిన్న 30 అడుగుల కాంపౌండ్ వాల్ ఓపెనింగ్ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. వీధిలైట్లు, బోరింగులు, ట్రాన్స్ ఫార్మర్ లు చాలా సాదాసీదాగా జరగాల్సిన పనులకు ప్రజాధనం ఖర్చుపెట్టడంతో ప్రజల్లో వైసీపీ నేతలపై తీరుపై అసహనం పెరుగుతోంది.
కాంపౌండ్ వాల్ ఓపెనింగుపైనే భారీ ఎత్తున క్రిటిసిజం వచ్చిన నేపథ్యంలో కూడా వైసీపీ నేతలు మేల్కోవడం లేదు. పార్టీకి మైలేజీ వస్తుందని అనుకుంటున్నారు గాని దానివల్ల జరుగుతున్న డ్యామేజీ భారీగా ఉంటోంది. తాజాగా ఒక గేదెను ప్రారంభించి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ వైరల్ అయ్యారు.
ఈ గేదెను ప్రారంభించడం ఏంటా అని తలగోక్కుంటున్నారా? ఒక వ్యక్తి కొత్త గేదెను కొన్నారు. దానికి ఆమె రిబ్బన్ కటింగ్ చేశారు. ఇదేం కర్మరా బాబూ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.