తమ్ముళ్ళందరు కలిసి టీడీపీ పరువును రోడ్డున పడేస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఈ గొడవల విషయంలో చూసీ చూడనట్లు ఉండటంతో తమ్ముళ్ళ కుమ్ములాటలకు అంతే లేకుండా పోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం నియోజకవర్గంలో రెండు బలమైన వర్గాలున్నాయి. మొదటిదేమే మాజీ ఎంఎల్ఏ ఉణ్ణం హనుమంతరాయ చౌదరి వర్గమైతే రెండోదేమో నియోజకవర్గం ఇన్చార్జి మద్దినేని ఉమామహేశ్వరనాయుడు వర్గం. ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు కావటంతో పార్టీ నేతల్లో వీళ్ళిద్దరిలో ఎవరిని సమర్ధించాలో అర్ధంకావటంలేదు.
రాబోయే ఎన్నికల్లో టికెట్ సాధించటం కోసమే వీళ్ళిద్దరు గొడవలు పడుతున్నట్లు అర్ధమవుతోంది. చౌదరేమో తనకు లేకపోతే తన కొడుక్కి టికెట్ ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుపడుతున్నారు. ఇదే సమయంలో యువకుడైన నాయుడు పార్టీ కార్యక్రమాలతో చొచ్చుకు వెళుతున్నారు. ఇద్దరికీ పార్టీలోను నియోజకవర్గంలోను పట్టుంది. ఈ కారణంగానే ఇద్దరి మధ్య నేతలు, క్యాడర్ రెండువర్గాలుగా చీలిపోయారు. దాంతో ప్రతి చిన్న విషయానికి ఇద్దరి మధ్య పెద్ద గొడవలు అయిపోతున్నాయి.
లోకేష్ పాదయాత్ర సందర్భంగా నేతలంతా ఆయా నియోజకవర్గాల్లో పెద్దఎత్తున పాదయాత్రలు జరపాలని పార్టీ హై కమాండ్ పిలుపినిచ్చింది. దానికి కూడా ఇద్దరు నేతలు వేర్వేరుగా స్పందించి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు. దీని ఫలితంగా పార్టీ నేతల్లోని విభేదాలు రోడ్డునపడ్డాయి. ఒకవైపు ఎన్నికలు వస్తున్నా తమ్ముళ్ళల్లో సమస్యలు సర్దుకోవాల్సిందిపోయి మరింతగా పెరుగుతున్నాయి.
ప్రతిచిన్నదానికీ తమ్ముళ్ళు కొట్టుకుంటుంటే ఇక రేపటి ఎన్నికల్లో టికెట్ దక్కని నేత ఎలా స్పందిస్తారనే ఆందోళన పెరిగిపోతోంది. ఒకళ్ళకి మరొకళ్ళు గోతులు తవ్వుకునే మనస్తత్వం పెరిగిపోవటంతోనే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయినా దాని నుండి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు తమ్ముళ్ళు. పార్టీ ఇమేజిని పెంచటానికి ఒకవైపు చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారు. ఇంకోవైపు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. తమ్ముళ్ళందరు కలిసికట్టుగా ఉండి మంచి ఫలితాలు సాధించాలని అనుకోవాల్సింది పోయి గొడవలు పడుతున్నారు. ఇలాంటి గొడవలే ఎన్నికల్లో పార్టీని దెబ్బతీస్తాయని తెలిసినా వ్యక్తిగత పంతాలకే ప్రాధాన్యత ఇస్తుండటమే విచిత్రంగా ఉంది.