ఒకప్పుడు ఒక సినిమా కు ఓ రిలీజ్ డేట్ ఇస్తే దాన్ని అందుకోవడానికి చాలా కష్టపడేవారు. అనుకున్న ప్రకారమే సినిమాను రిలీజ్ చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునేవాళ్లు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే డేట్ మార్చేవారు. అలా మార్చాల్సి వచ్చినపుడు అటు టీం, ఇటు ఫ్యాన్స్ చాలా ఫీలయ్యేవాళ్లు. కానీ కొవిడ్ పుణ్యమా అని ఈ సెంటిమెంట్లన్నీ కొట్టుకుపోయాయి.
‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రానికే నాలుగైదుసార్లు డేట్ మార్చాక వాయిదాల పర్వాన్ని అందరూ లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. రిలీజ్ డేట్ మారడం అన్నది ఒక కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. రాబోయే మూణ్నాలుగు నెలల్లో రావాల్సిన ఎన్నో సినిమాల రిలీజ్ డేట్లు అటు ఇటు అవడం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా రెండు సినిమాల డేట్ మార్పు గురించి అప్డేట్స్ వచ్చాయి. నవంబరు 10న దీపావళి కానుకగా రావాల్సిన ‘ఆదికేశవ’ను ఆ నెల 24కు మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మరోవైపు కళ్యాణ్ రామ్ సినిమా ‘డెవిల్’ సైతం వాయిదా పడింది. ఆ చిత్రం నవంబరు 24న రావాల్సింది. కానీ రీ రికార్డింగ్, వీఎఫెక్స్ పనులు పెండింగ్ ఉండటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. అతను ప్రస్తుతం సందీప్ రెడ్డి కొత్త చిత్రం ‘యానిమల్’ పనిలో బిజీగా ఉన్నాడు.
అతను ‘డెవిల్’ మీద దృష్టిపెట్టే పరిస్థితుల్లో లేడు. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా ఆలస్యం అవుతున్నాయట. షూటింగ్ పూర్తయినప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ సమయానికి పూర్తయ్యేలా లేకపోవడంతో ‘డెవిల్’ను వాయిదా వేయక తప్పట్లేదు. ఐతే డిసెంబరుతో పాటు సంక్రాంతి వరకు అన్ని వారాలూ ప్యాక్ అయిపోయి ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరిలో కానీ ఈ సినిమాను రిలీజ్ చేయడానికి స్కోప్ లేనట్లే. కాబట్టి కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ‘డెవిల్’ కోసం ఇంకో మూడు నెలలకు పైగా ఎదురు చూడాల్సిందే.