టాలీవుడ్ లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం కైకాల అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. నటుడిగా సినీ పరిశ్రమకు, ఎంపీగా ప్రజలకు సత్యనారాయణ చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కొద్ది సేపటి క్రితం కైకాల సత్యనారాయణ అంతిమయాత్ర మొదలైంది. ఫిల్మ్ నగర్ లోని కైకాల నివాసం నుంచి మహాప్రస్థానానికి కైకాల పార్థివ దేహాన్ని తీసుకెళుతున్నారు. పూలరథంలో వెళుతున్న కైకాలను కడసారి చూసేందుకు వాహనం వెంట ఆయన అభిమానులు, బంధువులు, కుటుంబ సభ్యులు వెళుతున్నారు. కైకాల మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
సీనియర్ నటులు చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు రాజకీయ నేతలు కైకాల పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కైకాల నివాసానికి వెళ్లిన కేసీఆర్ ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కైకాల మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరో దిగ్గజ నటుడిని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయిందని పలువురు కైకాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అంతకుముందు, కైకాల తన విలక్షణమైన నటనా శైలితో పేరుప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారని కేసీఆర్ చెప్పారు. హీరోలకు ఉండేంత గ్లామర్ ఆయనదని, ఏ పాత్ర ఇచ్చినా అందులో జీవిస్తూ అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. సత్యనారాయణగారు ఎంపీగా పని చేసినప్పుడు అనుభవాలను పంచుకున్నానని, కొంత కాలం తామంతా కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ కైకాల వంటి సీనియర్ ని కోల్పోవడం బాధాకరమని అన్నారు. సత్యనారాయణగారు లేని లోటును ఎవరూ పూడ్చలేరని చెప్పారు. ఆయన పోషించిన పాత్రలను పోషించేందుకు ఆయనకు సమానమైన నటులు ఇప్పుడు లేరని అన్నారు. ఆయన మృతి బాధాకరమని, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.