అధికారంలో ఉన్న వారి నోటి నుంచి వచ్చే మాటలకు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అందునా.. ఒక అంశంపై తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొంటున్న వేళ.. సదరు సమస్య పరిష్కారం ఇంత సింపుల్ అన్నట్లుగా మాట్లాడే మాటలతో జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు కదిరి వైసీపీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన అధికార పక్ష ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్ల సమస్యకు తనదైన శైలిలో పరిష్కారాన్ని తెలిపారు.
ఆయన నియోజకవర్గం పరిధిలోని తురకవాండ్లపల్లి గ్రామానికి చెందిన పది మంది ఆయన్ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా తమ ఊరి రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. రోడ్లు వేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆయన.. ఒక నెల పెద్ద వయస్కులకు ఇచ్చే పింఛన్లు ఇవ్వకుంటే ఒప్పుకుంటారా? అంటూషాకింగ్ వ్యాఖ్యాలు చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన కదిరికే రూ.15 కోట్ల పింఛన్ల సొమ్ము వస్తుందన్నారు.
ప్రభుత్వ నిధుల్ని రోడ్ల నిర్మాణానికి వెచ్చిస్తే రోడ్లు అన్నీ అద్దంలా తయారు చేయొచ్చని వ్యాఖ్యానించిన కదిరి ఎమ్మెల్యే.. ‘‘పింఛన్లకు వచ్చే సొమ్ముల్ని ఒక నెల ఆపి.. వాటిని రోడ్లకు వెచ్చిస్తే రోడ్లు అద్దంలా మారతాయి. మా ప్రభుత్వంలో మొదటి ప్రాముఖ్యం పింఛన్లకే.. తర్వాతే ఏవైనా’’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్లాగ్ షిప్ కార్యక్రమం గురించి గొప్పగా చెప్పటం బాగానే ఉన్నా.. వాటిని రోడ్లకు లింకు చేస్తూ మాట్లాడటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇప్పటికే రోడ్లు సరిగా లేవన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఈ తరహా వ్యాఖ్యలు అవసరమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.