ఏపీ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై తాజాగా కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ స్వంత జిల్లా అయిన కడపలో టీడీపీ అభ్యర్థగా పోటీ చేసిన మాధవీ రెడ్డి.. గట్టి పోటీని తట్టుకుని 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయభేరీ మోగించారు. ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు కడపలో తగ్గేదే లే అంటూ మాధవీ రెడ్డి దూసుకుపోతున్నారు.
మొన్నామధ్య చెత్త పన్ను విషయంలో మేయర్ సురేష్ బాబుతో వార్ కు దిగి వార్తల్లో నిలిచిన మాధవీ రెడ్డి.. తాజాగా జగన్, అవినాష్ రెడ్డిలపై చురకలు వేసింది. అసలేం జరిగిందంటే.. కడుపుతో జరిగిన డిఆర్సీ సమావేశానికి ఎమ్మెల్యే మాధవీ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లా అభివృద్దికి సంబంధించిన అంశాలపై సుధీర్గ చర్చ జరిగింది.
సమావేశం ముగిసిన అనంతరం వైసీపీ అనుకూల మీడియా విలేకరులు తల తిక్క ప్రశ్నలు అడగటంతో.. మాధవీ రెడ్డి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఎక్కడ మీ జగన్..? డీఆర్సీ సమావేశానికి మీ పులివెందుల ఎమ్మెల్యే జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు రాలేదు? అని మాధవీ ప్రశ్నించారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు అటు అసెంబ్లీకి రాడు, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి రాడు. మరి ప్రజలు ఓట్లు వేసింది ఎందుకు..? అంటూ ఆమె మండిపడ్డారు. ప్రోటోకాల్ ప్రకారం సమావేశానికి రావాల్సిన బాధ్యత ఉందని కూడా జగన్ కు తెలీదా..? అని మాధవీ రెడ్డి ప్రశ్నించారు. మేమంటే భయమా.. అందుకే రాకుండా డుమ్మా కొట్టారా..? అని కడప ఎమ్మెల్యే జగన్ ను ఎద్దేవ చేశారు.