వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఆలస్యం.. అంతకుముందు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రాజధానిగా ఎంచుకున్న అమరావతిని దెబ్బ తీసే ప్రయత్నాన్ని వ్యూహాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉండగా అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్న జగన్.. అధికారం చేపట్టాక మాట మార్చేశారు.
అమరావతి గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేసి రాజధానిని విశాఖపట్నానికి మార్చడానికి రంగం సిద్ధం చేశారు. కోర్టు వ్యవహారాల వల్ల ఈ ప్రక్రియ ఆగింది కానీ.. లేకుంటే ఈపాటికి ఎప్పుడో విశాఖకు రాజధాని మారిపోయేదే. ఆ సంగతలా ఉంచితే.. అమరావతి రాజధానిగా పనికి రాదని తేల్చే క్రమంలో ఆ ప్రాంతానికి వరద ముప్పు ఉందంటూ జగన్ సహా వైకాపా నేతలు గట్టి ప్రచారమే చేశారు.
గత ఏడాది అమరావతిలోని చంద్రబాబు నివాసాన్ని ముంచడానికి తెర వెనుక నుంచి ప్రయత్నం జరిగిందనే ఆరోపణలూ ఉన్నాయి.ఐతే ఈ ఏడాది ఏపీలో అన్ని చోట్లా భారీ వర్షాలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. ఐతే ఇప్పుడు అమరావతి మీద ఫోకస్ పెట్టడానికి అధికార పార్టీ నేతలకు తీరిక లేనట్లుంది. వాస్తవం ఏంటంటే.. ఇప్పుడు అమరావతిలో ఎక్కడా వరదల ఊసు లేదు.
హైకోర్టు మునిగిపోయిందని, అమరావతి అంతటా నీళ్లే అని కొన్ని ఫేక్ ఫొటోలు పెట్టి వైకాపా మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు కానీ.. వాస్తవంగా ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా వరద ముప్పు లేదు. కానీ చిత్రంగా వైఎస్ జగన్ సొంత ప్రాంతమైన కడప జిల్లాను వరదలు ముంచెత్తి భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
శతాబ్దాల చరిత్ర ఉన్న కడప నగరం ఇప్పుడు వరదలతో అల్లాడిపోతోంది. బుగ్గవంక ప్రాజెక్టులో గేట్లు ఎత్తడంతో ఆ నీరు నగరాన్ని ముంచెత్తింది. 2001లో ఇలాగే బుగ్గవంక దెబ్బకు నగరం వణికింది. అప్పుడు 30 మందికి పైగా ప్రాణాలు వదిలారు. ఇప్పుడు కడప నగరంలో పలు చోట్ల వీధుల్లో నిలువెత్తు నీళ్లు వచ్చి భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది చూసి అమరావతి మద్దతుదారులు సోషల్ మీడియాలో జగన్ సర్కారును టార్గెట్ చేశారు. అమరావతి మునిగిపోతుందంటే కడప మునిగిందేంటి.. ముందు సీఎం సొంత జిల్లాను చూసుకోవాలంటూ కౌంటర్లు వేస్తున్నారు.