రాజకీయాల్లో పరిణామాలు చాలా వేగంగా మారిపోతుంటాయి. చిన్న తప్పులకు సైతం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంచనాల్లో జరిగే పొరపాట్లతో కొన్నిసార్లు జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుంది. తెలిసి తెలియక..అత్యుత్సాహంతో అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరఫున పోటీ చేస్తున్న మనమ్మాయి కమలా హ్యారీస్ కు ఇప్పుడు అలాంటి చిక్కులే ఎదురయ్యాయి. ఆమె మేనకోడులు చేసిన ట్వీట్ తో అమెరికాలోని హిందువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదేం పని అని తప్పు పడుతున్నారు.
దీనికి కారణం.. కాళిమాత ఫోటోను కమలా హ్యరీస్ గా మార్ఫ్ చేయటమే కాదు.. అమ్మవారికి వాహనంగా ఉండే సింహం ముఖాన్ని మార్చేయటం.. రాక్షకుడి స్థానంలో ట్రంప్ ఫోటోను పెట్టటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజా ప్రయోగంపై గుర్రుగా ఉన్న హిందూ భారతీయులు తమ ఆగ్రహాన్ని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. అయితే.. ఈ ఫోటోకు కమలా హ్యారీస్ కు నేరుగా సంబంధం లేకున్నా.. ఆమె మేనకోడలే ఇలంటివి తయారు చేయటాన్ని తప్పుపడుతున్నారు.
తక్షణమే కమలా క్షమాపణలు చెప్పాలని.. హిందూ అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ కోరింది. హిందూ మత ప్రతిమలను అమెరికా రాజకీయ సేవల్లో ఉపయోగించకూడదని వారు చెబుతున్నారు. కమలా మేనకోడలు మీనా హారిస్ హిందూ సమాజాన్ని కించపరిచిందని.. తీవ్ర ఆగ్రహానికి గురి చేసిందని వారు చెబుతున్నారు.
ఈ మార్ఫ్ చేసిన చిత్రంలో కాళికా మాతకు బదులుగా కమలా హ్యారిస్ ఫోటోను..మహిషాసురుడి స్థానంలో ట్రంప్ ఫోటోను.. సింహం ముఖం స్థానంలో అధ్యక్షుడి పోటీ చేస్తున్న జో బైడెన్ ముఖాన్ని పెట్టటాన్ని తప్పుపడుతున్నారు. ఈ ఫోటోపై హిందూ సమాజం నుంచి అభ్యంతరం వ్యక్తం కావటంతో ఆ ఫోటోను సోషల్ మీడియాలో తొలగించారు.అయితే.. దీనిపై కమలా హ్యారిస్ క్షమాపణలు చెప్పాలన్న అమెరికన్ హిందువుల డిమాండ్ పై ఆమె రియాక్టు కాలేదు. మరీ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.