ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకునే సీన్ లేనప్పటికీ.. ప్రపంచ రాజకీయాలు.. ప్రపంచ నాయకుల గురించి అదే పనిగా మాట్లాడే సిత్రమైన రాజకీయ నేత తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నారేమో? ప్రపంచంలోని పలు దేశాల అధ్యక్షులు తనకు ఫోన్ కాల్ దూరంలో ఉన్నారంటూ తరచూ చెప్పే కేఏ పాల్.. ఇటీవల కాలంలో మీడియాలో కనిపించని పరిస్థితి. ఏడాదిన్నర క్రితం ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అదే పనిగా కనిపించిన ఆయన.. ఇటీవల తన జోరు తగ్గించారు.
తాజాగా జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాల్ మండిపడ్డారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఓట్ల లెక్కింపు పూర్తి కాక ముందే.. తాను గెలిచినట్లుగా ఎలా ప్రకటించుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఓట్ల లెక్కింపును ఆపాలంటూ సుప్రీంకోర్టుకు వెళతానన్న వ్యాఖ్యను తప్పు పట్టారు.
ఇటీవల కాలంలో అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని ట్రంప్ నియమించారని.. తాను సుప్రీంలో కేసు వేస్తే ఫలితం తనకు అనుకూలంగా వస్తుందన్న ఆలోచనతోనే ట్రంప్ ఈ పని చేసి ఉంటారన్నారు. సుప్రీంకు వెళతానంటూ ట్రంప్ డ్రామాలు ఆడుతున్నట్లుగా పేర్కొన్నారు. తన ఓటమిని ముందుగానే పసిగట్టి..జీర్ణించుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.
ట్రంప్ తన ఓటమిని ముందే పసిగట్టారని.. అది జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్రంప్ పై పాల్ ఫైర్ అవుతూ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.