ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రబోధకుడు కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్…మన తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సుపరిచితుడు..అపరిచితుడు కూడా. అవలీలగా అమెరికా అధ్యక్షుడితో డిన్నర్ చేశానని చెప్పే పాల్…తన చొరవతోనే ఎన్నో యుద్ధాలు ఆగిపోయాయని బిల్డప్ ఇస్తుంటారు. తనను సీఎంని చేస్తే ఏపీని అమెరికాలా మారుస్తానని, ఏపీకి వేల కోట్లు ఫండ్ తెస్తానని కామెడీ చేయడం పాల్ కు పరిపాటి.
ఇలా, పాల్ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు కోకొల్లలు. నిత్యం తన వ్యాఖ్యలతో యూట్యూబ్ లో వైరల్ పొలిటిషియన్ గా మారిన పాల్ తాజాగా మరోసారి తన మార్క్ కామెడీతో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో తొమ్మిది పార్టీలతో కలిసిన పవన్ కల్యాణ్ రాజకీయాలకు అస్సలు పనికిరాడని తేల్చేస్తూ పాల్.చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. పవన్‌ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, అందుకే జేడీ లక్ష్మీనారాయణ వంటి వ్యక్తులు కూడా ఆయనను విడిచిపెట్టేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు పాల్.
విభజన హామీలు నెరవేర్చని కేంద్రంపై నిరసన వ్యక్తం చేసేందుకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తున్నానని, తన ధర్నాకు మద్దతివ్వాలని కేసీఆర్, జగన్, చంద్రబాబు, పవన్ లను కోరారు. అయితే, ఆ నలుగురి మద్దతు కోరుతూనే వారిపై తీవ్ర విమర్శలు గుప్పించాల్ కిలారి ఆనంద్ పాల్. కేసీఆర్ క్లౌడ్‌బరస్ట్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని, సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడడం ఏమిటని సెలవిచ్చారు పాల్.
కేంద్రం, ఏపీ, తెలంగాణ చేస్తున్న అప్పులతో దేశం త్వరలోనే శ్రీలంక, వెనిజులా మాదిరిగా మారడం ఖాయమని జోస్యం చెప్పారు పాల్ బాబా. హైదరాబాద్‌లో గ్లోబల్ సమ్మిట్ పెడతానని చెబితే దానిని గుజరాత్లో పెట్టాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఆగస్టు 15లోపు పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని వార్నింగ్ ఇచ్చారు పాల్. పవన్ గాలి తీస్తూ పాల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.