ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రబోధకుడు కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్…ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఈ పేరు సుపరిచితమే. ఒబామాతో డిన్నర్ చేశా…ట్రంప్ తో టెన్నిస్ ఆడా…ఆ ప్రపంచ యుద్ధాన్ని ఆపాను…ఇలా పాల్ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు అన్నీ ఇన్నీ కావు. నిత్యం తన వ్యాఖ్యలతో యూట్యూబ్ లో వినోదాన్ని పంచుతుంటారు పాల్. తనను సీఎంని చేస్తే ఏపీని అమెరికా చేస్తానని…ఏపీకి వేల కోట్లు ఫండ్ ఇప్పిస్తానని చెబుతూ కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు పాల్.
ఈ క్రమంలోనే తాజాగా పాల్ తన కామెంట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎం కేసీఆర్ తనకు భయపడ్డారని అందుకే తన సభకు అనుమతినివ్వలేదని పాల్ షాకింగ్ కామెంట్లు చేశారు. తానెవరో తెలియదని హైదరాబాద్ కమిషనర్ అన్నారని, గూగుల్ లో తన పేరు వెతికితే తానెవరో తెలుస్తుందంటూ పాల్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. మే 6న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టుకునేందుకు పాల్ అనుమతి కోరగా పోలీసులు నిరాకరించారు.
దీంతో, తెలంగాణ పోలీసులపై కేఏ పాల్ మండిపడ్డారు. ఓటు బ్యాంకు లేని రాహుల్ గాంధీ సభకు అనుమతిచ్చారని, కానీ, రైతుల కోసం సభ నిర్వహించి ఉద్యమం చేస్తున్న తనకు భయపడి కేసీఆర్ అనుమతివ్వలేదని ఆరోపించారు. తన సభకు అనుమతివ్వవద్దంటూ హైదరాబాద్, వరంగల్ కమిషనర్లను కేసీఆర్ బెదిరించారని పాల్ ఆరోపించారు.
సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేదని, సభకు అనుమతివ్వలేదని, కానీ, తాను ఆగుతానా? అని ప్రశ్నించారు. తననెవ్వరూ ఆపలేరని, ఎలా ఆపుతారో చూస్తానని సవాల్ విసిరారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్.. అప్పుల తెలంగాణ చేశారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు, నిరుద్యోగులకు అండగా పోరాడతానని పాల్ చెప్పారు.