ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు కేఏ పాల్ ఎక్కడా తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు మించి తన పార్టీకి ప్రజల మద్దతుందని చెప్పుకుంటున్నారు. కేఏ పాల్ లాంటి వ్యక్తులు లేకపోతే రాజకీయాల్లో ఈ మాత్రం కామెడీ కూడా ఉండకపోను. తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీకి 60 శాతం జనాల మద్దతుందని ఢిల్లీలో ప్రకటించారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన మత ప్రబోధకుడు పాల్ ఏరోజు ఏమి మాట్లాడుతారో ఎవరికీ అర్ధం కావటంలేదు.
తనను ముఖ్యమంత్రిని చేస్తే ఏపీకి లక్షల కోట్ల రూపాయలు పెట్టబడులు పట్టుకొస్తానని ఆమధ్య ప్రకటించారు. తాను గనుక అధికారంలోకి వస్తే అమెరికాను మించి రాష్ట్రాన్ని తయారుచేస్తానంటు పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్, వైసీపీ రెండు కుటుంబపార్టీలే అంటు ధ్వజమెత్తారు. కనీసం ఈ రెండు కుటుంబపార్టీలుగా అన్నా గుర్తింపుంది. తన ఆధ్వర్యంలోని ప్రజాశాంతిపార్టీకి అసలు కేంద్ర ఎన్నికల కమీషన్ గుర్తింపు కూడా లేదన్న విషయాన్ని పాల్ మరచిపోయారు.
తెలుగు రాజకీయాల్లో గట్టిగా చెప్పాలంటే పాల్ జోకర్ పాత్రను పోషిస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తరచూ జనాల్లో తిరుగుతు నోటికొచ్చింది మాట్లాడుతూ నవ్వులు పూయిస్తున్నారు. ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. జనసేనను తన పార్టీలో విలీనం చేసేస్తే వెంటనే ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. జనసేనపార్టీకి పవన్ ఆఫర్ ఇవ్వడంపై అనేక జోకులు పేలాయి. పాల్ మోస్ట్ పాపులర్ పర్సనాలిటీ కావచ్చు. కానీ పొలిటికల్ ఫేస్ జీరో. పవన్ ఏపీలో బలమైన ప్రభావం చూపగలిగిన వ్యక్తి… అలాంటి వ్యక్తికి పాల్ ఆఫర్ ఇవ్వడం కామెడీ కాక మరేంటి?
మొన్నటి ఎన్నికల్లో నరసాపురం నుంచి పార్లమెంటుకు పాల్ పోటీ చేసిన విషయం తెలిసిందే. చివరకు ఏమైందో తెలీదు కానీ తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి విచిత్రంగా వైసీపీకి ఓట్లేయమని ప్లకార్డులు పెట్టుకుని తిరిగారు. ఇలాంటి పాల్ కూడా తన పార్టీకి 60 శాతం జనాల మద్దతుందని ప్రకటించటమంటే చాలా విచిత్రంగానే ఉంది. ముందు ముందు ఇంకెన్ని జోకులు వేస్తారో చూడాల్సిందే!