గెటప్‌లు వేస్తూ.. మాటల తూటాలు పేలుస్తూ.. రాజకీయాలను కాక పుట్టిస్తున్న కామెడీ పొలిటికల్ స్టార్ కేఏ పాల్ తాజాగా మరో వేషం వేశారు. తన అదిరిపోయే లాంగ్వేజ్‌తో ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.
ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలో తనకు తానే సాటి.. తనకు లేరు పోటీ అని చెబుతున్న పాల్.. విజయమూ.. వారూ.. వన్ సైడే అని నినాదాలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. మునుగోడు విక్టర్ ముందే డిసైడ్ అయిపోయిందని.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఫార్మాలిటీ కోసమేనని ఆయన చెబుతున్న తీరు అందరినీ కడుపుబ్బ నవ్విస్తోంది.
పనిలో పనిగా ఎన్ని మాటలు చెప్పినా.. ఏముంటుంది? అనుకుంటున్న పాల్.. వివిధ వృత్తుల వారిని కలిసేందుకు ఆయా వేషాలు వేస్తున్నారు. రెండు రోజుల కిందటమునుగోడు మండలంలోని రైతులను కలుసుకునేందుకు వెళ్లారు. నిజానికి ఆయనకు బెంజ్ కారు ఉంది. ప్రత్యకంగా డ్రైవర్ కూడా ఉన్నాడు. అయితే, అవన్నీ వదిలేసి.. పంచె కట్టుకుని, బనీన్ వేసుకుని అచ్చం రైతు వేషం కట్టారు.
అంతేకాదు.. సైకిల్‌పై రోడ్డు మీద వెళ్తూ.. రైతుల కష్టాలను వెల్లడించారు. “నేను నా రైతు సమాజం తరఫున గళం వినిపిస్తున్నా“ అంటూ.. తనను తారు రైతుగా ప్రచారం చేసుకున్నారు.
ఇక, పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడారు. కట్ చేస్తే.. తాజాగా ఆయన గొర్రెల కాపరి వేషం కట్టారు. బనీను, తలకు పాగా పెట్టుకుని చేతిలో కర్ర, మరో చేతిలో అన్నం క్యారేజీ, చంకలో నీళ్ల కడవ మోస్తూ.. ఫక్తు గొర్రెల కాపరిగా దిగిపోయారు.
అంతేకాదు.. ఆయన వెనుక ఓ ఇరవై గొర్రెలు కూడా ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మీడియాను అక్కడకే పిలుచుకుని.. గొర్రెల కాపరుల సమస్యలు వివరించారు. “మేం బీసీలం. గొల్లలం. ప్రభుత్వం మాకేమైనా చేసిందా. మా పిల్లలు డిగ్రీ చదువుకుని ఉద్యోగాలకోసం చూస్తుంటే కేసీఆర్ గొర్రెలు ఇస్తాను మేపుకోండి అంటారా? అందుకే నీకు అధికారం ఇచ్చింది?“ అని ప్రశ్నించారు.
అంతేకాదు. “కేసీఆర్, ఆయన కుటుంబం ఏమో.. వేల కోట్లు లక్షల కోట్లు సంపాయించుకుని విమానాల్లో తిరగాలా? గొల్లలు, గొల్లల పిల్లలు మాత్రం డిగ్రీ చదువుకుని గొర్రెలు కాచుకోవాలా?“ అని నిలదీశారు.
ఈ సందర్భంగా మునుగోడు తలరాత మారుస్తానని.. 70 శాతం మంది ఉన్న బీసీలు తనను గెలిపించాలని ఆయన సోదాహరణంగా ఎన్నికల ప్రసంగాన్ని సోలోగా దంచికొట్టారు. ఇదీ.. సంగతి!!ఇక, మరో రెండు రోజలు పాటు ఎన్నికల ప్రచారానికి సమయం ఉన్న నేపథ్యంలో `పాల్ వేషాలు` ఇంకెన్ని చూడాలో అంటున్నారు మునుగోడు ప్రజలు.
Munugode bypoll: డిగ్రీలు చేసిన యువత గొర్రెలు కాయాలా?: కేఏ పాల్ మండిపాటు#MunugodeBypoll #KAPaul #Politics pic.twitter.com/UDCOkv5WJT
— Eenadu (@eenadulivenews) October 30, 2022