కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. అది, ఉప ఎన్నికైనా, సార్వత్రిక ఎన్నికైనా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పాల్ అమెరికా నుంచి ఇండియాలో వాలిపోతారు. తాను ఒకడిని ఉన్నానంటూ ఎమ్మెల్యే, ఎంపీ పదవికి నామినేషన్ వేస్తూ మహామహులతో పోటీ పడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాన్ ను టార్గెట్ చేస్తూ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను ఫెయిల్యూర్ పొలిటిషన్ అంటూ పవన్ చేసిన కామెంట్స్ పై పాల్ తన మార్క్ విశ్లేషణతో షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ తన ఫెయిల్డ్ పొలిటిషన్ అని స్వయంగా ఒప్పుకున్నారని, ఆ గట్స్ తనకు నచ్చాయని అన్నారు. అయితే, ఆ విషయం తాను ప్రజారాజ్యం పెట్టిన సమయంలోనే పవన్ కు చెప్పానని పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏ పార్టీలో చేరొద్దు, కలిసి పని చేద్దామని తాను పవన్ తో 2008లో చెప్పానని పాల్ అన్నారు.
ఆనాడు పవన్ తన మాట వినలేదని, ఆ తర్వాత కూడా జనసేన పెట్టి టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చారని పాల్ అన్నారు. బిజెపి కూడా మతతత్వ పార్టీ అని పవన్ విమర్శించారని, ఆ తర్వాత సిపిఐ, సిపిఎం, బీఎస్పీ లతో కలిసి పోటీ చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత మళ్లీ బిజెపితో జతట్టడం ఏమిటని పాల్ ప్రశ్నించారు. బిజెపిని పవన్ రోడ్డు మ్యాప్ అడుగుతున్నారని, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న బీజేపీని రోడ్ మ్యాప్ అడగడం ఏమిటని అన్నారు.
నీతి కోసం నిజాయితీ కోసం పవన్ పని చేయాలని, 100% సక్సెస్ అవ్వాలంటే తనతో కలిసి పనిచేయాలని పాల్ పిలుపునిచ్చారు. పవన్ ఇన్ని పార్టీలతో కలిసి పోతూ నిలకడ లేకుండా ఉంటే ఎలా సక్సెస్ అవుతారని పాల్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ధైర్యంగా తనతో కలిసి రావాలని, ఈ వీడియోను పవన్, జనసైనికులు అందరితో షేర్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ మారుతున్నందుకే పవన్ ఫెయిల్డ్ పొలిటిషన్ గా ఉన్నారని పాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పాల్ కామెంట్లపై జనసైనికులు మండిపడుతున్నారు.