టాలీవుడ్లో లెజెండరీ డైరెక్టర్లందరి కెరీర్లనూ పరిశీలిస్తే.. వాళ్లకు వయసు పెరిగి, మారిన ట్రెండ్‌ను అర్థం చేసుకోలేక, వరుసగా ఫ్లాపులు పడ్డా కూడా వెనక్కి తగ్గలేదు. తమ స్థాయికి తగని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి తీస్తూ పోయారు.
ఇక తమ పనైపోయిందని అంగీకరించడానికి వాళ్లకు మనసు ఒప్పలేదు. ఒక దశ దాటాక మరీ సాధారణమైన సినిమాలు తీసి ప్రేక్షకులతో ఇక చాలు మహాప్రభో అనిపించారు. రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు లాంటి ఆల్ టైం గ్రేట్ డైరెక్టర్లు చాలామంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నవారే. కానీ వీళ్లందరితో పోలిస్తే కె.విశ్వనాథ్ పరిస్థితి భిన్నం.
ముందు నుంచే ఆయన ఇబ్బడిముబ్బడిగా సినిమాలు తీసేయలేదు. సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ తీసుకుని నెమ్మదిగా పని చేసేవారు. తన నుంచి సినిమా వస్తే అది చాలా బలంగా ఉండాలని ఆయన కోరుకునేవారు. అందుకే చేసినవి తక్కువ సినిమాలే అయినా.. వాటిలో చాలా వరకు కళాఖండాలుగా మిగిలాయి.
విశ్వనాథ్ కెరీర్లో ఆయన ముద్రను చాటిన చివరి సినిమా అంటే ‘శుభ సంకల్పం’యే. కమర్షియల్‌గా మరీ పెద్ద సక్సెస్ కాకపోయినా.. అది హిట్ సినిమానే. విశ్వనాథ్ మేటి చిత్రాల్లో దాన్ని కూడా ఒకటిగా చెప్పొచ్చు. ఐతే దీని తర్వాత విశ్వనాథ్ ఫామ్ కోల్పోయారు. వెంకటేష్‌తో చేసిన ‘చిన్నబ్బాయి’ ఆయన కెరీర్లోనే అతి పెద్ద పరాజయాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఆయన ఉన్నట్లుండి దర్శకత్వాన్ని పక్కన పెట్టేశారు.
నటుడిగా మారి చాలా సినిమాల్లో నటించారు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత శ్రీకాంత్‌తో ‘స్వరాభిషేకం’ అనే సినిమా తీస్తే అది కూడా ఆడలేదు. మళ్లీ గ్యాప్ తీసుకున్నారు. ఇంకో ఆరేళ్లకు అల్లరి నరేష్‌తో ‘శుభప్రదం’ తీశారు. ఇది కనీస స్థాయిలో కూడా ప్రభావం చూపలేకపోయింది.
ఇక అంతే విశ్వనాథ్ మెగా ఫోన్ పక్కన పెట్టేశారు. ఇక ఇలాంటి సినిమాలు తీసి తన స్థాయిని తగ్గించుకోవడం ఇష్టం లేక మళ్లీ దర్శకత్వం జోలికే వెళ్లలేదు. ఇలా వాస్తవాన్ని గుర్తించి అస్త్రసన్యాసం చేయడంలోనే విశ్వనాథ్ ప్రత్యేకత దాగి ఉంది.