మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో న్యాయం కోసం వైఎస్ సునీతా రెడ్డి చాలాకాలంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అన్న జగన్ సీఎంగా ఉన్న రాష్ట్రంలో తనకు న్యాయం జరగడం లేదని, అందుకే ఈ కేసును పొరుగు రాష్ట్రంలోని హైకోర్టులో విచారణ జరిపేలా బదిలీ చేయాలని సునీత ఏపీ హైకోర్టుకు విన్నవించుకున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే తాజాగా సునీతకు అండగా టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి నిలిచారు.
సోషల్ మీడియా వేదికగా సునీతకు న్యాయం చేయాలంటూ ఓ క్యాంపెయిన్ ను మొదలుబెట్టారు. సునీతకు న్యాయం జరగాలని, అందుకే ఆమెకు మద్దతు తెలుపుతున్నానని రమణా రెడ్డి ప్రకటించారు. # Justice for Sunita (జస్టిస్ ఫర్ సునీత) పేరుతో రమణా రెడ్డి ట్విటర్ లో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఆనం అనే నేను వైఎస్ సునీత గారి పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నానని, మీకు కూడా మద్దతు తెలపాలంటూ రమణా రెడ్డి పిలుపునిచ్చారు.
దీంతో, ఆనం షేర్ చేసిన ఫొటో, ఈ హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారాయి.
కాగా, జగన్ ను ఆనం టార్గెట్ చేయడం ఇది తొలిసారి కాదు. గంజాయాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చిన జగన్ కు ఇటీవల కేక్ కట్ చేసి మరీ సన్మానించారు ఆనం. జగన్ పాలనలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతోనే నేడు ఏపీ గంజాయి వాడకంలో నెం.1గా నిలిచిందని ఆయన ఎద్దేవా చేశారు. గంజాయి రవాణాలో జగన్ సాధించిన ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేస్తూ కేక్ కట్ చేశామని, ఆయన ఫొటోకు కేక్ తినిపించామని ఆనం చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.