హష్ మనీ కేసులో ట్రంప్ కు శిక్ష పక్కా అంటూనే జడ్జి కీలక వ్యాఖ్యలు!
జనవరి 20 అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతల్ని చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..ఆయనపై నమోదైన కేసులకు సంబంధించిన తీర్పులు వెలువడుతున్నాయి. ఈ నెల పదిన హష్ మనీ కేసుకు సంబంధించి కూడా తీర్పు వెలువడనుంది.
ఈ కేసుకు సంబంధించి సదరు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. హష్ మనీ కేసులో అమెరికాకు అధ్యక్షుడిగా కాబోతున్న ట్రంప్ నకు శిక్ష విధిస్తానని పేర్కొన్న న్యూయార్క్ న్యాయమూర్తి.. అంతలోనే ట్రంప్ శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించటం గమనార్హం
ఇప్పటికే పెను సంచలనాలకు కారణమైంది ఈ హష్ మనీ కేసు. పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్ తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ట్రంప్.. ఆ సందర్భంగా పాత విషయాలపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్ మనీని ఇప్పించారన్నది ప్రధాన ఆరోపణ.
అదే సమయంలో ఆ భారీ మొత్తం ప్రచార కార్యక్రమాల కోసం అందించిన విరాళాల నుంచి దాన్ని ఖర్చు చేశారన్న అంశంపై ఆయన న్యాయ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. ఈ అంశాలపై ఆరు వారాల విచారణ తర్వాత ట్రంప్ పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మందితో కూడిన జడ్జీల ధర్మాసనం ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తీర్పును వెలువరించింది.
ఈ కేసులో ట్రంప్ తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ కోర్టులో స్వయంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఈ వ్యవహారంలో ట్రంప్ పై అభియోగాలు మరింతలా బిగుసుకున్నాయి. ఆమెతో సహా 22 మంది సాక్ష్యుల్ని కోర్టు విచారించింది.
ఇదిలా ఉంటే.. ఈ కేసులకు సంబంధించిన ఈ నెల 10న ట్రంప్ కోర్టుకు హాజరు కావాలని పేర్కొన్న న్యాయమూర్తి.. ఆయనకు శిక్ష విధిస్తానంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ట్రంప్ జైలుశిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని న్యూయార్క్ జస్టిస్ హవాన్ మర్చన్ పేర్కొన్నారు. అయితే.. ట్రంప్ కు శిక్ష విధిస్తానని పేర్కొన్న న్యాయమూర్తి.. ఆయరన జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా అన్ కండిషనల్ డిశ్చార్జ్ ను అమలు చేస్తామని పేర్కొనటం గమనార్హం.
అయితే.. శిక్ష విధించే రోజు ట్రంప్ వ్యక్తిగతంగా లేదంటే వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు. దీంతో.. శిక్ష ఖరారై వైట్ హౌస్ లోకి అడుగు పెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. శిక్ష వేయాలనే జడ్జి నిర్ణయాన్ని ట్రంప్ ప్రతినిధి ఖండించారు. ఈ చట్టవిరుద్ధమైన కేసును కొట్టివేయాలని డిమాండ్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. శిక్ష విధిస్తానని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు ఫైన్ కూడా వేయకుండా ఉండే శిక్ష ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.