ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్‌పై విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబును కోర్టుకు తీసుకు రావాలని సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద కోర్టును కోరారు. పీటీ వారెంట్‌పై సుదీర్ఘ వాదనలు వినిపించిన వివేకానందకు రేపు కూడా వాదనలు కొనసాగించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో, రేపు మధ్యాహ్నం గం.2.30కు ఈ కేసులో తదుపరి వాదనలను కోర్టు విననుంది. ఇక, కాల్ డేటా పిటిషన్‌పై వాదనలు కూడా రేపు వింటామని చంద్రబాబు తరఫున న్యాయవాదులకు కోర్టు తెలిపింది.
మరోవైపు, చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పాస్ ఓవర్ అడగగా ఏసీబీ కోర్టు జడ్జి అందుకు అనుమతించారు. హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్, ఇత బెయిల్ పిటిషన్లు విచారణలో ఉన్నందున పాస్ ఓవర్ అడిగారు. అంతకుముందు, ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ సందర్భంగా రైట్ టు ఆడియన్స్ కింద వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. అయితే, ఆ అభ్యర్థనను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది.