ఉమ్మడి ఏపీలో జరిగిన 2009 ఎన్నికల్లో టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచార బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయాధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు మార్గదర్శకుడిగా తారక్ చేసిన ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని….ఊహాగానాలు వచ్చినా…సినిమాల్లో బిజీగా ఉన్న తారక్ రాజకీయాలవైపు రాలేదు.
ఇక, 2024 ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నారని కూడా పుకార్లు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే తారక్ రావాలని, టీడీపీ పగ్గాలు కూడా తారక్ కు ఇవ్వాలని సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టులు వస్తుంటాయి. అవన్నీ పుకార్లేనన్న సంగతి తెలిసిన తారక్ మాత్రం తన మానాన తాను వరుస సినిమా షూటింగులు, ప్రోగ్రామ్ లతో బిజీబిజీగా ఉన్నారు.
”ఎవరు మీలో కోటీశ్వరులు” షో ప్రెస్ మీట్ లో సందర్భంగా ”మళ్ళీ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు” అన్న ప్రశ్నకు తారక్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లోకి రావడానికి ఇది సమయం…. సందర్భం కాదని తారక్ ఆ ప్రశ్నను తోసిపుచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉన్నారని మీడియా మిత్రులతో సరదాగా తారక్ వ్యాఖ్యానించి ఆ ప్రశ్నను దాటవేశారు. అంతేకాదు, ఈ టాపిక్ పై మళ్లీ కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని ఆ ప్రశ్న అడిగిన విలేఖరికి సమాధానమిచ్చారు తారక్.
అయితే, ఈ సందర్భంగా అసలు రాజకీయాల్లోకి పునరాగమనం చేయనని తారక్ చెప్పకపోవడంతో ఏదో ఒక రోజు తమ అభిమాన నటుడు రాజకీయాల్లోకి వస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన రాజకీయ రంగ ప్రవేశంపై తన మనసులోని మాటను బయటపెట్టారు తారక్. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
“నేను ప్రస్తుతం నా జీవితంలో చాలా చాలా సంతోషకరమైన దశలో ఉన్నాను. ఒక యాక్టర్ గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. నేను మొదట నుంచి దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. ఫ్యూచర్ అంటే ఐదేళ్లు తర్వాత, పదేళ్ల తరువాత ఉంది అని అనుకొనే మనిషిని కాను. భవిష్యత్ అంటే నా నెక్స్ట్ సెకన్ ఏంటి అనేది ఆలోచించే మనిషిని. ప్రస్తుతం ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నాను. యాక్టింగ్ అనేది నాకు ఎనలేని సంతృప్తినిచ్చే పనిగా ఉంది. నేను అందులోనే ఉండాలనుకుంటున్నాను” అని తారక్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా పొలిటికల్ రీఎంట్రీపై తారక్ తాజా కామెంట్లు…వైరల్ అయ్యాయి.