టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రాజమౌళి చెక్కుతోన్న ఈ పిరియాడికల్ ఫిక్షన్ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు నటించిన ఈ చిత్రం నుంచి విడుదలైన నాటు నాటు పాట, దోస్తీ పాటసహా అన్ని అప్డేట్లు వైరల్ అయ్యాయి.
జనవరి 7న సినిమా విడుదల కాబోతోన్న సందర్భంగా ఈ చిత్రం గురించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా లీక్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ నెల 26న ఈ చిత్రంలోని మూడో పాటను విడుదల చేయబోతోన్న రాజమౌళి అండ్ కో…తాజాగా మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఆ రోజు విడుదల కాబోతోన్న మూడో పాట అయిన ‘జనని’ కోసం యంగ్ టైగర్ తారక్ తన గొంతు మరోసారి సవరించుకున్నారని తెలుస్తోంది.
‘యమదొంగ’, ‘కంత్రీ’, ‘అదుర్స్’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాల్లో జూ.ఎన్టీఆర్ పాడిన పాటలు సూపర్ హిట్ లుగా నిలిచాయి. ఆ తర్వాత తన మిత్రుడు, దివంతగ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కోసం తారక్ ఓ పాట పాడారు. ఆ తర్వాత తాజాగా ఆర్ఆర్ఆర్ కోసం తారక్ మరోసారి మైక్ పట్టుకున్నారట. ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం తారక్‌తో ఎం.ఎం.కీరవాణి ఓ పాట పాడించారని టాక్. ఈ గాసిప్ లో నిజమెంతో తేలాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.
ఇక, ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో రివేంజ్ డ్రామాగా ఓ సినిమా చేస్తున్నానని చెప్పాడు తారక్. ఫిబ్రవరి నుంచి ఆ చిత్ర షూటింగ్ మొదలవుతోందట. ఆ తర్వాత , ప్రశాంత్ నీల్ సినిమా అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళుతుందని, అది ‘కేజీఎఫ్’ తరహాలో సాగే భారీ యాక్షన్ సినిమా అని తారక్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రివీల్ చేశాడు.