అతని పేరు కౌశిక్. వయసు 19 ఏళ్లు. ఆంధ్ర అబ్బాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు విరాభిమాని అయిన కౌశిక్.. గత కొంత కాలం నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం చావుబతుకుల్లో ఉన్నాడు. ప్రతినిత్యం మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. అయితే కౌశిక్ చివరి కోరిక ఏంటో తెలిస్తే కన్నీళ్లాగవు. ఎన్టీఆర్ పై అభిమానంతో కాదు కాదు పిచ్చి ప్రేమతో దేవర సినిమా చూడటమే తన ఆఖరి కోరికగా కౌశిక్ చెబుతున్నాడు.
దేవర చూసేవరకు తనను బతికించమంటూ డాక్టర్స్ ను వేడుకుంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్ (19) బోన్ క్యాన్సర్ బారిన పడ్డాడు. 2022 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కౌశిక్ పరిస్థితి విశమించింది. బోన్ మారో చికిత్సకు రూ.60లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో.. కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని తల్లిదండ్రులు తాపత్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సాయం కోసం తాజాగా కౌశిక్ తల్లి సరస్వతి తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాలో మాట్లాడారు. `నా కొడుకు జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. దేవర సినిమా చూసి చచ్చిపోతా.. సెప్టెంబర్ 27వ తేదీ దాకా బతికించండని డాక్టర్స్ ను వేడుకుంటున్నాడు. అదే అతని చివరి కోరిక అంటున్నాడు. నా బిడ్డను బతికించండయ్యా` అంటూ సరస్వతి కన్నీరు పెట్టుకున్నారు. తన కుమారుడు వైద్యానికి ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారడంతో.. నెటిజన్లు, అభిమానులు కౌశిక్ కోరిక తీరాలని, అతను బతకాలని ప్రార్థిస్తున్నారు. మరి ఎన్టీఆర్ మరియు దేవర చిత్ర బృందం కౌశిక్ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.