కొడాలి నాని…వైసిపి నేతగా, గుడివాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కొడాలి నాని గతంలో తన రాజకీయ జీవితాన్ని టిడిపితో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అన్నగారు నందమూరి తారక రామారావు, ఆయన తనయుడు హరికృష్ణలు తనకు రాజకీయ భిక్ష పెట్టారని గతంలోనే కొడాలి నాని చాలాసార్లు చెప్పారు. అందుకే హరికృష్ణ తనయుడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తోను కొడాలి నానికి అనుబంధం ఉంది.
అయితే, గతంలో కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ అప్పుడప్పుడు కలిసిన ఫోటోలు వీడియోలు బయటికి వచ్చేవి. కానీ, గత కొంతకాలంగా కొడాలి నాని, తారక్ లు భేటీ అయిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే కొడాలి నానిపై మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ రాష్ట్రాధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర బాడీగార్డ్ మాదిరిగా పనిచేసిన కొడాలి నాని….చివరకు ఆయనను కూడా మోసం చేశారని వంగలపూడి అనిత షాకింగ్ కామెంట్లు చేశారు.
అందుకే కొడాలి నానిని జూనియర్ ఎన్టీఆర్ దూరం పెట్టేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నందమూరి హరికృష్ణను కొడాలి నాని ముంచేశారని అందుకే అప్పట్లో ఆయనను హరికృష్ణ తన్ని తరిమేశారని సంచలన ఆరోపణలు చేశారు అనిత. ఇక, తాజాగా సీఎం జగన్ వంతు వచ్చిందని, ఆయనకు కూడా కొడాలి నాని టోపీ పెట్టడంతోనే క్యాబినెట్ నుంచి తొలగించారని అనిత సంచలన విమర్శలు గుప్పించారు.
తిరుమల కొండను వైజాగ్ లోని రుషికొండతో ఏ విధంగా పోలుస్తారని అనిత మండిపడ్డారు. కొందరు స్వార్థపరుల కోసమే రుషికొండను జగన్ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం కొంత కొండను పగలగొట్టి అక్కడ నిర్మాణాలను చేపట్టారని, ఆ క్రమంలో పచ్చదనానికి పర్యావరణానికి ఏ విధమైన ముప్పు కలగలేదని అనిత చెప్పారు. టెన్త్ ఫెయిల్ బ్యాచ్ మొత్తం వైసిపిలోనే ఉందని, కనీస జ్ఞానం లేకుండానే కొడాలి నాని మాట్లాడుతున్నారని అనిత విమర్శించారు.
విశాఖలో వైసీపీ నేతల భూధందాలు బయటపడతాయన్న కారణంతోనే అమరావతి రైతుల పాదయాత్రను వైసిపి నేతలు అడ్డుకుంటున్నారని అనిత ఫైర్ అయ్యారు. అందుకే, మూడు రాజధానులు, ఉత్తరాంధ్ర గర్జన అంటూ నానా రాద్ధాంతం చేస్తున్నారని, ఈ నెల 15న జరిగేది ప్రజాగర్జన కాదని భూ కబ్జారాయుళ్ల సభ అని ఎద్దేవా చేశారు. విశాఖలో ఏర్పడింది జేఏసీ కాదని జగన్ యాక్షన్ కమిటీ అని సెటైర్లు వేశారు.