నందమూరి తారక రామారావు…షార్ట్ కట్ లో ఎన్టీఆర్…ఈ పేరు చెప్పగానే ప్రతి తెలుగోడికి గుర్తుకు వచ్చే మొదటి వ్యక్తి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు (సీనియర్ ఎన్టీఆర్). ఇటు సినీ రంగంలోనూ, అటు రాజకీయ రంగంలోనూ తారా జువ్వలా వెలుగులు చిమ్మిన ఎన్టీఆర్ తెలుగు సినీ, రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించారు. అదే తరహాలో తాత పేరు పెట్టుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(జూ.ఎన్టీఆర్) కూడా తాతకు తగ్గ మనవడిగా ఆయన నట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారు.
17 ఏళ్లకే హీరోగా నటించిన తారక్…అద్భుతమైన నటుడిగా ఖ్యాతి గడించారు. పాత్రేదైనా, ఘట్టమేదైనా..నేను రెడీ…అంటూ పరకాయ ప్రవేశం చేసి వెండితెరపై రక్తికట్టించంలో తాతకి తగ్గ మనవడనిపించుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో భీమ్ పాత్రలో తారక్ నటనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్న నేపథ్యంలో బాలీవుడ్ మీడియాకు తారక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా తాతగారి గురించి తారక్ పలు విషయాలు పంచుకున్నారు.
తాతగారు గొప్ప నటుడు, రాజకీయ నాయకుడే కాకుండా ఈ దేశపు గొప్ప పౌరుడని, ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని తారక్ చెప్పారు. ఈ దేశ పౌరుడిగా ఇప్పటి వరకు ఎంతో పొందామని, సమాజానికి ఏదైనా చేయాలన్న కాన్సెప్ట్ ను, ఇతరులకు ప్రేమను పంచాలని, సేవ చేయాలన్న సిద్ధాంతాన్ని తాతగారి నుంచి నేర్చుకున్నానని చెప్పారు. ఆ ప్రేమని తన అభిమానులకు ఎలా అందివ్వాలని ఎప్పుడూ ఆలోచిస్తుంటాని తెలిపారు.
మంచి సినిమాలు చేయడం ద్వారానే అది సాధ్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నానని అన్నారు. అయితే, తాతగారిలాగా యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నారా ? అని ఎన్టీఆర్ ని ప్రశ్నించగా…ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి తాను సినిమాలలో నటిస్తున్నానని, వాటిపైనే ఫోకస్ ఉందని రాజకీయాల గురించి సమాధానం దాటవేశారు తారక్. ఫ్యూచర్ అంటే ఐదేళ్లు తర్వాత, పదేళ్ల తరువాత ఉంది అని అనుకొనే మనిషిని కాదని, భవిష్యత్ అంటే నెక్స్ట్ సెకన్ ఏంటి అనేది ఆలోచించే మనిషినని చెప్పారు. ప్రస్తుతం ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నానని, నటుడిగా చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు.