‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో భీం పాత్రలో నటించిని జూ.ఎన్టీఆర్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తారక్, చరణ్ ల అద్భుతమైన నటనకు ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. బాలీవుడ్ లోనూ దుమ్మురేపుతున్న ఈ చిత్రం ఓవరాల్ గా 1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన తారక్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
తాను 17 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చానని, తన తొలి చిత్రం నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని తారక్ అన్నాడు. హిట్ సినిమాలకు అందురూ చుట్టాలేనని, కానీ, ఫ్లాప్ సినిమా మాత్రం అనాధగా మిగిలిపోతుందని తారక్ అన్నారు. తమ సినీ ఇండస్ట్రీలో…ఆ మాటకొస్తే ప్రపంచంలోని ప్రతి సినీ ఇండస్ట్రీలో ఇదే పరిస్థితి ఉందంటూ హిట్, ప్లాప్ సినిమాల గురించి అడిగిన ప్రశ్నపై తన మనసులోని మాట చెప్పాడు తారక్.
అయితే, తాను ఫలితంతో పని లేకుండా సినిమాలు చేస్తానని, ఈ సినిమా అయిపోయింది…తర్వాత సినిమా ఏంటి అనేదానిపైనే ఫోకస్ ఉంటుందని చెప్పుకొచ్చాడు తారక్. అలా…మూవ్ ఆన్ కావడం అనేది నాకున్న లక్షణం అని, గతం గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం ఉండదని అన్నాడు తారక్. అభిమానులు తనపై చూపే ప్రేమాభిమానాలు ఎనలేనివని, వారికి తిరిగి అదే ప్రేమను సినిమాల రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటానని చెప్పాడు తారక్.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానని, స్టూడెంట్ నెం.1 చిత్రం మొదలు ఆర్ఆర్ఆర్ వరకు ఆయనతో తనకు వ్యక్తిగతంగా కూడా అనుబంధం ఉందని చెప్పాడు తారక్. చరణ్ తో తనకు చాలాకాలంగా స్నేహం ఉందని, ఈ సినిమాలో చెర్రీ కూడా అద్భుతంగా నటించాడని కితాబిచ్చాడు.