బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ల తరహాలో టాలీవుడ్ లో స్టార్ హీరోలు డేర్ చేసి భారీ మల్టీ స్టారర్ చిత్రాలు చేయడం చాలా అరుదు.‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ లోనూ ఆ తరహా చిత్రాలు చేయవచ్చన్న కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఆ కోవలోనే ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ బడ్జెట్ చిత్రంతో తారక్, చెర్రీలు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఓ రకంగా ఇది సాహసమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అయితే, గతంలో హీరో పాత్ర ప్రయారిటీ, సీన్లపై తేడాలుండేవని….కానీ, ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు వాటన్నింటినీ దాటుకుని ముందుకొచ్చారని తారక్ సినిమా రిలీజ్ కు ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. హీరో పాత్రలు ఇలానే ఉండాలనే లెక్కలు ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదని, అభిమానులు కూడా పాత్రల నిడివి పట్టించుకోవడం మానేశారని అన్నాడు. ఫ్యాన్ వార్ వద్దని, క్యారెక్టర్ల ప్రకారం స్క్రీన్ స్పేస్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ, ఆంధ్రా, తెలంగాణలోని కొన్ని చోట్ల ఫ్యాన్ వార్ ఆగలేదు.
ఇక, ఈ సినిమాలో తారక్ పాత్ర నిడివి తక్కువని, క్లైమాక్స్ లో అయితే…అసలు స్పేస్ ఇవ్వలేదని తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ పాత్ర ఎక్కువగా హైలైట్ అయిందని వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై తారక్ స్పందించాడు. చరణ్ కు, తనకు ఇద్దరికీ రాజమౌళి సమానమైన స్క్రీన్ స్పేస్ ఇచ్చారని చెప్పాడు.
ఒక సీన్ లో తన పాత్రను ఎలివేట్ చేస్తే, మరో సీన్ లో చరణ్ పాత్రను ఎలివేట్ చేశారని అన్నాడు. తన పాత్రపై తనకు ఎలాంటి అసహనం కానీ, అసంతృప్తి కానీ లేవన్నాడు. ఇద్దరిలో ఏ ఒక్కరికీ అన్యాయం చేయలేదని, అలా జరిగుంటే ‘ఆర్ఆర్ఆర్’ ఇంత అద్భుతంగా వచ్చేది కాదని చెప్పుకొచ్చాడు. మరి, తారక్ క్లారిటీ ఇచ్చిన తర్వాతైనా ఆయన ఫ్యాన్స్ చల్లబడతారో లేదో వేచి చూడాలి మరి.