నాలుగు రోజుల పాటు కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. వర్షాలు తగ్గినా వరదలు మాత్రం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆంధ్రాలో విజయవాడ, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. ఎటు చూసినా నీరు ఏరులై పారడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి కష్టకాలంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వరదల విలయం సృష్టించిన నేపథ్యంలో ఎన్టీఆర్ భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం ఒక్కో రాష్ట్రానికి రూ. 50 లక్షలు చొప్పున రూ. కోటి విరాళాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ద్వారా ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. `రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది.
అతి త్వరలో ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ. 50 లక్షలు విరాళం గా ప్రకటిస్తున్నాను` అంటూ ట్వీట్ లో ఎన్టీఆర్ తెలియజేశారు. దీంతో ఆయనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ చేసిన పనికి తెగ మురిసిపోతున్నారు.