డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడంపై టీడీపీ నేతలు మొదలు విపక్ష పార్టీల నేతలంతా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై నందమూరి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా పేరు మార్చడాన్ని నందమూరి తారక రామారావు మనవడు, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్, ఆయన సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ తీవ్రంగా ఖండించారు.
ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులని తారక్ అన్నారు. ఇలా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదని జూనియర్ ఎన్టీఆర్ హితవు పలికారు. అలా పేరు మార్చడ ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని కూడా అన్నారు. ‘విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’ అని తారక్ చెప్పారు.
ఈ పేరు మార్పుపై కల్యాణ్ రామ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం తనకు బాధ కలిగించిందని కల్యాణ్ రామ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లాభం కోసం అనేక మంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అని కల్యాణ్ రామ్ హితవు పలికారు.
ఇక, యూనివర్శిటీని స్థాపించిందే ఎన్టీఆర్ అని, ఆయన పేరును ఎలా తొలగిస్తారని నందమూరి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ పేరిట నందమూరి కుటుంబం తరఫున ఒక ప్రకటన విడుదలైంది. ఇదొక దురదృష్టకరమైన పరిణామమని, తెలుగు వారి ఆత్మాభిమానాన్ని నలుదిక్కులా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని వారు చెప్పారు. అన్ని కుల,మతాలవారు గౌరవించే యుగపురుషుడి పేరును మార్చడం ముమ్మాటికీ తెలుగు జాతిని అవమానించినట్టేనని చెప్పారు.