తెలంగాణలో మునుగోడు బై ఎలక్షన్ డేట్ దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ మూడో తేదీన పోలింగ్ జరగబోతుండడంతో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీa అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అభ్యర్థులకు మద్దతుగా, కేసీఆర్ కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు మాటలతూటాలు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ బిజెపి నేతకు మంత్రి కేటీఆర్ చేసిన ఫోన్ కాల్ లీక్ కావడం సంచలనం రేపింది.
దీంతో, బీజేపీపై టీఆర్ఎస్ నేతలంతా గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గుర్తుతెలియని వ్యక్తులు సమాధి నిర్మించడం పెను దుమారం రేపుతోంది. 2016లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో జేపీ నడ్డా దండుమల్కాపురంలో పర్యటించారు. ఆ సమయంలో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.
అయితే, ఆరేళ్లు దాటినా ఆ హామీ నెరవేరలేదు. దీంతో, ఆ సెంటర్ ఏర్పాటు చేస్తానన్న స్థలంలో జేపీ నడ్డాకు గుర్తు తెలియని వ్యక్తులు సమాధి కట్టారు.ఈ క్రమంలోనే ఇది టీఆర్ఎస్ పనేనంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. బతికున్నవారికీ సమాధి కట్టే దుస్సంప్రదాయానికి టీఆర్ఎస్ తెర తీసిందని ఆరోపించారు. నడ్డా ఇక్కడ పోటీ చేసి గెలిచారా? ఆయన మీద ఈ అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు.
మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఈ తరహా దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఈ చర్యతో టీఆర్ఎస్ హద్దులు దాటిందని మండిపడ్డారు. గతంలో తన దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారని, తమ సహనాన్ని అసమర్థతగా భావిస్తే టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని ఆమె ట్వీట్ చేశారు.