ఓవైపు ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి.. గెలుపును తాను ఒప్పుకోవటం లేదంటూ మొండిగా మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మరోసారి విపరీత వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించిన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ తాజాగా 300లకు పైగా ఓట్లు సాధించటం తెలిసిందే.
అయినప్పటికీ అధికార బదలాయింపునకు ససేమిరా అంటున్నారు ట్రంప్. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకున్నది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నా.. ట్రంప్ మాత్రం అందుకు భిన్నంగా సంచలన వ్యాక్యలు చేస్తున్నారు. నిన్నటి వరకు బైడెన్ గెలిచారన్న మాటను కూడా ఒప్పుకోని ఆయన.. తాజాగా మాత్రం బైడెన్ గెలుపొందారు కానీ మీడియా ఫేక్ కథనాల్లోనే అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే న్యాయపోరాటానికి దిగిన ట్రంప్.. తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తాజాగా ముగిసిన ఎన్నికలు రిగ్గింగ్ ఎన్నికలుగా పేర్కొంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజా ఫలితాల్ని తాను అంగీకరించే ప్రసక్తే లేదని మరోసారి తేల్చారు. నవంబరు మూడున జరిగిన అధ్యక్ష ఎన్నికల పోలింగ్ లో అత్యధిక సీట్లను సాధించిన బైడెన్ కు పగ్గాలు అప్పజెప్పాల్సి ఉన్నప్పటికీ.. ట్రంప్ మాత్రం ససేమిరా అంటున్నారు. జనవరిలో ప్రమాణస్వీకారం చేయాల్సిన బైడెన్ కు రానున్న రోజుల్లో మరెన్ని సవాళ్లు ఎదురవుతాయో చూడాలి.