డొనాల్డ్ ట్రంప్ 2014లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లోకల్ సెంటిమెంట్ ను అమెరికన్లలో బలంగా రాజేసిన సంగతి తెలిసిందే. ట్రంపు తీసుకున్న కంపు నిర్ణయాలతో భారత్ సహా విదేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేసేవారు నానా ఇబ్బందులు పడ్డారు. భారతీయులతో పాటు పలు దేశాల వారి డాలర్ డ్రీమ్స్ తీర్చే హెచ్-1బీ వీసాలపై ట్రంప్ నిషేధం విధించడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే హెచ్- బీ వీసాలపై నిషేధం ఎత్తేస్తానని అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్ చెప్పడంతో డాలర్ డ్రీమ్స్ చూస్తున్నవారంతా ఊరట చెందారు. అయితే, బైడెన్ వచ్చిన తర్వాత ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలను రద్దు చేస్తున్న బైడెన్…ఈ వీసాల విషయంలో మాత్రం సైలెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ వీసాలపై హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో యమోర్కాస్ చేసిన వ్యాఖ్యలు హెచ్-1బీ వీసాదారుల ఆశలపై తాత్కాలికంగా నీళ్లు చల్లాయి.
ఆ వీసాలకంటే తమ ముందు మరిన్ని ముఖ్యమైన అంశాలున్నాయని యమోర్కాస్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఈ ప్రకటనతో హెచ్-1బీ వీసాలపై నిషేధం ఎత్తివేత ఇప్పట్లో సాధ్యం కాదన్న సంకేతాలు యమోర్కాస్ ఇచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాము ప్రస్తుతం శరణార్థుల సమస్యల పరిష్కారం, చట్టవిరుద్ధంగా తమ తల్లిదండ్రులతో దేశానికి వచ్చిన వారిని ఆదుకోవడం, వృత్తి నిపుణుల సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేశామని ఆయన అంటున్నారు.
దీంతో, వీసాలపై ఉన్న ఆంక్షలపై బైడెన్ తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. హెచ్1-బీ వీసాలపై నిషేధం తొలగిస్తే, అమెరికన్లలో వ్యతిరేకత రావచ్చని బైడెన్ భావిస్తుండం కూడా ఈ జాప్యానికి మరొక కారణమని తెలుస్తోంది. ట్రంప్ గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం మార్చి 31వరకు హెచ్-1బీ వీసాలపై నిషేధం అమలులో ఉంటుంది. ఈ లోపు బైడెన్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.