అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి ఆంధ్రప్రదేశ్లా మారుతోంది. అప్పుల కుప్పగా మారి ఖజానా ఖాళీ అయిపోయింది. అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేక ఏకంగా ఆయన తన ఆస్ట్రేలియా పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకున్నారని ఇంటర్నేషనల్ మీడియా కోడై కూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అగ్రరాజ్యం ఇప్పుడు అప్పుల రాజ్యంగా మారిపోయిందంటున్నారు. అప్పులు తీసుకోవడానికి పరిమితి పెంచుతూ ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్ర వేయకపోవడంతో ప్రస్తుతం అమెరికా దివాలా అంచున ఉంది.
ఇంతకీ అమెరికాకి అప్పులు ఎంత ఉన్నాయి?
అమెరికా ప్రభుత్వానికి 2021 నాటికి 28.5 ట్రిలియన్ డాలర్ల అప్పు ఉంది. మన రూపాయల లెక్కలో చెప్పుకొంటే సుమారు 23 కోట్ల కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు. 2023 జనవరి సరికి అమెరికా అప్పులు మరో 3 ట్రిలియన్ డాలర్లు పెరిగి 31.5 ట్రిలియన్ డాలర్లు కూడా దాటిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా అప్పులున్న దేశాలలో అమెరికా కూడా ఒకటి. అమెరికా ప్రభుత్వం తీసుకునే రుణాలపై గరిష్ట పరిమితిని డెట్ సీలింగ్ అంటారు. ఈ డెట్ సీలింగ్ ప్రకారం నిర్ధేశించిన పరిమితికి మించి ప్రభుత్వం అప్పులు చేయడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బంది వేతనాలు, సామాజిక భద్రత, మెడికేర్, రుణాలపై వడ్డీల చెల్లింపులు, పన్ను రిఫండ్లు వంటి అనేక ఖర్చులు చెల్లింపుల కిందకు వస్తాయి. మరిన్ని అప్పులు చేసేందుకు అమెరికా చట్టసభ కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. ఇప్పటికే అమెరికా పరిమితికి మించి అప్పులు చేసింది. దీంతో ఈ రుణ పరిమితి పెంచడానికి అమెరికా పార్లమెంట్ అంగీకరించడం లేదు.
ప్రస్తుతం అమెరికా రుణ సీలింగ్ 31.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2023 జనవరిలోనే అమెరికా గవర్నమెంట్ ఈ లిమిట్ దాటేసిందట. దీంతో ప్రత్యేక నిబంధనలను అడ్డంపెట్టుకుని అక్కడి ఆర్ధిక శాఖ నిధులు సమకూర్చుతున్నది. కొత్త రుణాలు తీసుకునేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమెదం విషయంలో రాజకీయంగా చిక్కులు ఏర్పడుతున్నాయి. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు మోజార్టీ ఉంది. రుణ పరిమితిన పెంచాలని కోరుతున్న అధికార డెమోక్రాట్ల ప్రతిపాదనను రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. కొత్తగా రుణాలు తీసకునే కంటే ఖర్చులు తగ్గించుకోవాలని, ఆర్ధిక నిర్వహణ మెరుగుపరుచుకోవాలని కోరుతున్నారు.
రుణ పరిమితి పెంచకుంటే ప్రభుత్వం చేసే చెల్లింపుల పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఫలితంగా ఆర్ధిక సంక్షోభం పెద్దదవుతుంది. ఆర్ధిక వ్యవస్థ వేగంగా పతనం అయ్యే ప్రమాదం ఉంటుంది. సకాలంలో రుణాల వడ్డీలు చెల్లించకుంటే దివాలాకు దారితీస్తుంది. దీని వల్ల ఏజెన్సీలు అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గిస్తాయి. దీని వల్ల కొత్త రుణాలపై అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రిటైల్ రుణాల రేట్లు పెరుగుతాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే స్టాక్ మార్కెట్లు పతనం అవుతాయి. ఆర్ధిక వ్యవస్థ సం క్షోభంలోకి జారుకుంటుంది. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతారు. రుణ పరిమితిని పెంచేందుకు చట్ట సభ ఆమోదించకపోతే ఆర్ధిక శాఖ తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపులను నిలిపివేయాలి, వేతనాలు, పింఛన్లు నిలిపివేయాలి. పెట్టుబడులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం భారీగా ఖర్చులు తగ్గించుకుంటే కొంత వరకు ఆర్ధిక వ్యవస్థ గండం కట్టె క్కేందుకు అవకాశం కలుగుతుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.