ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెనుదిరిగిన వెంటనే తాలిబన్లు దేశంలో అల్లకల్లోలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఓ పక్క అందరికీ ప్రాణభిక్ష పెట్టామంటూ శాంతి వచనాలు జపిస్తున్న తాలిబన్లు..మరోపక్క అమెరికాకు సాయం చేసిన వారి కోసం ఇంటింటికి జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే దేశం విడిచి వెళ్లేందుకు వేలాదిమంది ప్రజలు విమానాశ్రయం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘన్ ప్రజల దుస్థితికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయమే కారణమంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై బైడెన్ స్పందించారు. అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని బైడెన్ సమర్థించుకున్నారు. తాలిబన్ల కంటే ప్రమాదకర శక్తులు ప్రపంచంలో మారణహోమం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయని, వాటిని నియంత్రించడానికే తాము ఆప్ఘన్ నుంచి వైదొలుగుతున్నామని బైడెన్ వెల్లడించారు. ఆఫ్ఘన్ నుంచి వెనక్కి రప్పించిన తమ దళాలను ఎక్కువ ముప్పు ఉన్న చోటకు పంపుతున్నామని బైడెన్ వెల్లడించారు.
ఆఫ్ఘన్లో తాలిబన్లతోపాటు సిరియా, తూర్పు ఆఫ్రికా దేశాల్లో అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు నానాటికీ బలపడుతున్నారని, ఆ ఉగ్రసంస్థలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని బైడెన్ అభిప్రాయపడ్డారు. కానీ, అనూహ్యంగా తాలిబన్లు దేశాన్ని స్వాధీనపరుచుకోవడంపై బైడెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు, ఆఫ్ఘన్లో తమకు సాయపడ్డ సుమారు 30 వేల మంది శరణార్థులకు అమెరికా ఆశ్రయం కల్పించనుంది.
అమెరికా దళాలకు సాయం చేసిన ఆఫ్ఘన్లను తాలిబన్లు టార్గెట్ చేస్తారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అమెరికాకు, ఆఫ్ఘన్ సైన్యానికి సాయం చేసిన పలువురిని తాలిబన్లు చంపేశారు. అమెరికాకు సాయం చేసిన వారిని గుర్తించేందుకు ఇంటింటికి వెళ్తూ తాలిబన్లు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో వేలాది మంది దేశం విడిచి వెళ్లేందుకు విమానాలకు వేలాడబడేందుకు సైతం వెనుకాడడం లేదు.