కొందరికి కొన్ని ఇమేజ్ లు ఉంటాయి. ట్రంప్ అన్నంతనే.. ముక్కోపి అని.. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని.. ఎటకారం ఎక్కువని.. ఆయనకు ఓపిక తక్కువని..తనను తప్పు పట్టినా.. వేలెత్తి చూపించినా ఆయన అస్సలు ఊరుకోలేరని.. తిట్టి పోస్తారని చెబుతారు. అదే బైడెన్ అంటే.. మీడియాలో ఇప్పటివరకు ఆయన మీద ఎలాంటి నెగిటివ్ అభిప్రాయం లేదు. ఆయన పెద్దరికంగా ఉంటారని.. హుందాగా ఉంటారని మెచ్చుకుంటారు. అలాంటి వయసు మీద పడిన బైడెన్ సైతం.. తనను ఇరుకున పడేసే ప్రశ్నల్ని అడిగిన రిపోర్టర్ ను నోటికి వచ్చినట్లు తిట్టిపోస్తారన్న విషయం తాజాగా ప్రపంచానికి అర్థమైంది.
మైక్ కట్ అయ్యిందన్న ఉద్దేశంతో.. తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడికి బ్యాడ్ లక్ వెంటాడింది. ఎందుకంటే.. ఆయన నోటి నుంచి బూతుమాట వచ్చే సమయానికి మైక్ ఆన్ లో ఉండటంతో.. ఆ మాట కాస్తా రికార్డు కావటం.. ఇప్పుడది వైరల్ గా మారి.. రచ్చగా మారింది. బైడెన్ తీరును పలువురు తప్పు పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకూ పెద్ద మనిషిలా కనిపించే బైడెన్ ను అంతలా ఇరుకున పడేసిన ప్రశ్న ఏమిటి? ఇంతకీ ఆ రిపోర్టర్ ఎవరు? ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఏమైంది?
రాయలేని తిట్టు తిట్టిన సమయంలో రిపోర్టర్ రియాక్షన్ ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే..
జనవరి 24న వైట్ హౌస్ లోని ఈస్ట్ రూంలో కాంపిటీషన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో ధరల తగ్గింపుపై చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. ఆ సమయంలో ఫాక్స్ న్యూస్ కు చెందిన వైట్ హౌస్ రిపోర్టర్ పీటర్ డూసీ.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను ప్రశ్నిస్తూ.. మీరు ద్రవ్యోల్బణంపై ప్రశ్నను ఎదుర్కోవటానికి సిద్ధమేనా? మిడ్ టర్మ్ ఎన్నికల వేళలో ద్రవ్యోల్బణాన్ని రాజకీయ భారంగా భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన బైడెన్ ఒకింత కోపాన్ని అదిమిపెట్టుకొని.. ఎటకారంగా రియాక్టు అయ్యారు.
అధిక ద్రవ్యోల్బణం ఉండటం గొప్ప ఆస్తి అన్న ఆయన.. ఆ తర్వాత మైక్ కట్ అయ్యిందని భావించి.. వాట్ ఏ స్టుపిడ్ ……. అంటూ రాయలేని తిట్టు తిట్టేశారు. అయితే.. అప్పటికి మైక్ ఆన్ లో ఉండటంతో ఆ తిట్టు నిక్షేపంగా రికార్డు అయ్యింది. అయితే.. ఆ సమయంలో ఆ ప్రదేశం మొత్తం కోలాహలంగా ఉండటంతో ప్రశ్న అడిగిన విలేకరికి ఆయన తిట్టు వినిపించలేదు. అనంతరం బ్రీఫింగ్ రూంకు వచ్చిన సదరు రిపోర్టర్ కు మిగిలిన వారు జరిగిన విషయం గురించి చెప్పటం.. అది కాస్తా వైరల్ గా మారింది.
ఇదే అంశంపై ఫాక్స్ న్యూస్ షోలో సదరు రిపోర్టర్ ను రియాక్షన్ అడిగారు. దీనికి స్పందించిన సదరు రిపోర్టర్ డూసీ.. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు బైడెన్ ఇష్టపడలేదన్నారు. తన ప్రశ్నకు ముందు మరో విలేకరి రష్యాపై ఒక ప్రశ్న అడిగారని.. సంబంధం లేని ప్రశ్నలు అడగొద్దన్నారని.. దీంతో.. తాను తయారు చేసుకున్న మిగిలిన ప్రశ్నల్ని వదిలేసి.. ద్రవ్యోల్బణం మీద ప్రశ్నించినట్లు చెప్పారు.
బైడెన్ తిట్టు తనకు వినిపించలేదని.. ఆ తర్వాత తోటి రిపోర్టర్లు చెప్పటంతో తనకు విషయం తెలిసిందన్నారు. అయితే.. ఈ ఉదంతం జరిగిన గంట తర్వాత సదరు రిపోర్టర్ సెల్ కు ఫోన్ రావటం.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వయంగా మాట్లాడుతూ..ఆ తిట్టును పర్సనల్ గా తీసుకోవద్దని కోరినట్లు చెప్పారు. సారీ చెప్పినట్లు చెప్పారు దీంతో.. తమ మధ్య ఉన్న గందరగోళాన్ని తొలగించారని.. తమ మధ్య ఆరోగ్యకర సంభాషణ సాగినట్లు చెప్పారు. తాను చాలా ప్రశ్నలు అడగాలన్న విషయాన్ని బైడెన్ కు చెబితే.. ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా పేర్కొన్నారు.
మొత్తంగా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత.. అధికారంలో ఉన్న వారిని ఇరుకున పడే ప్రశ్న ఎదురైతే.. దానికి అధికారం తెచ్చే అహంకారమే సమాధానం అవుతుందన్న విషయం మరోసారి నిరూపితమైందని చెప్పక తప్పదు.